Telugu Gateway
Andhra Pradesh

జగన్ ప్లాన్స్ బ్రేకులు !

జగన్ ప్లాన్స్ బ్రేకులు !
X

రాజధాని విషయం లో వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్లాన్స్ కు ఎప్పటికప్పుడు బ్రేకులు పడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం జరిగిన ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్గ సమావేశంలో సీఎం జగన్ ఈ జులై నుంచి తాను వైజాగ్ నుంచే పాలన సాగిస్తానని ప్రకటించారు. అప్పటికి అంతా సర్దుకుంటుంది అని వెల్లడించారు. అయితే పరిస్థితి చూస్తుంటే న్యాయపరంగా మాత్రం వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చెప్పటం ఇప్పట్లో సాధ్యం అయ్యే సూచనలు కనిపించటం లేదు. ఎందుకంటే అమరావతే రాజధాని అని...ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ జగన్ సర్కారు సుప్రీం కోర్ట్ లో పిటిషన్ వేయగా దీనిపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్ట్ నిరాకరించింది. అదే సమయంలో అమరావతి అంశంపై వెంటనే విచారణ ప్రారంభించాలన్న ప్రభుత్వ న్యాయవాదుల వినతిని కూడా కోర్టు తోసిపుచ్చుతూ ఈ కేసు విచారణను జులై 11 కు వాయిదా వేశారు. కనీసం వచ్చే నెలలో అయినా కేసు విచారణ జరపాలని కోరినా ...ఈ కేసు లో చాలా మంది వాదనలు వినాల్సి ఉన్నందున వెంటనే విని..తీర్పు ఇవ్వటం సాధ్యం కాదు అని సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ జస్టిస్ జోసెఫ్, బీ వీ నగరత్న ధర్మాసనం తేల్చి చెప్పింది. దీంతో వైసీపీ సర్కారు కు అమరావతి విషయంలో మరోసారి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాలను ఉపసంహరించుకున్న తరువాత ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అర్ధం లేదన్న ఏపీ తరపు లాయర్ లు వాదనలు వినిపించారు. అయితే..వీరు చేసిన విజ్ణప్తులను న్యాయమూర్తి జస్టిస్ కె ఎం జోసెఫ్ పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు.

జూన్ 16న జస్టిస్ కె ఎం జోసెఫ్ పదవీ విరమణ చేయనున్నారు. అందుకే కేసు విచారణను జులై 11కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. జులై 11న వేరే ధర్మాసనం ముందు అమరావతి కేసు విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు చెపుతున్నారు. తాను రిటైర్ అవుతున్నందున అమరావతిపై సుదీర్ఘ వాదనలు విని జడ్జిమెంట్ రాసేందుకు సమయం లేదని న్యాయమూర్తి కె ఎం జోసెఫ్ తెలిపారు. తాజా పరిణామాలతో సీఎం జగన్ వైజాగ్ కేంద్రంగా కార్యకలాపాలు స్టార్ట్ చేస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. అయితే జగన్ వైజాగ్ కాదు...ఎక్కడి నుంచి అయినా పాలనా సాగించవచ్చు అని..కానీ దానికి అధికారికంగా రాజధాని అనే ట్యాగ్ లేకపోతే అది ప్రజలను మోసం చేయటం తప్ప మరొకటి కాదు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎక్కువమంది. వైజాగ్ ను అధికారికరంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామని చెప్పి ఇప్పుడు నేనొస్తున్నా అంటే ఉపయోగం ఉండక పోగా రాజకీయంగా కూడా నష్టం జరిగే ప్రమాదం ఉంది అనే టెన్షన్ వైసీపీ నేతల్లో ఉంది. కేంద్రం కూడా రాజధానిగా అమరావతి నిర్ణయం విభజన చట్టం ప్రకారమే జరిగింది అని తేల్చి చెప్పింది. దీంతో ఇది తేలటం అన్నది అంత ఈజీ కాదు అని చెపుతున్నారు.

Next Story
Share it