ఏపీ పంచాయతీ ఎన్నికల కేసు.సుప్రీం బెంచ్ మారింది
ఏపీలో పంచాయతీ ఎన్నికల వ్యవహారం అత్యంత ఉత్కంఠ రేపుతోంది. ఓ వైపు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. మరో వైపు ప్రభుత్వం మాత్రం ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని చెబుతోంది. ఈ తరుణంలో హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై ఏపీ సర్కారు చేసిన అప్పీల్ సోమవారం నాడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. అయితే వాస్తవానికి ఈ కేసు తొలుత లావు నాగేశ్వరరావు బెంచ్ ముందు లిస్ట్ అయింది. అయితే లావు నాగేశ్వరరావు ఏపీకి చెందిన వ్యక్తి కావటంతో రిజిస్ట్రీ బెంచ్ మార్పులు చేశారు.
లావు నాగేశ్వరావు బెంచ్ నుంచి ఇప్పుడు జస్టిస్ సంజయ్ కౌషన్ కౌల్ , జస్టిస్ రిషికేశ్ రాయ్ బెంచ్ కు కేసు మార్చారు. ఏపీ సర్కారు అప్పీల్ తోపాటు ఉద్యోగ సంఘాలు కూడా మరో పిటీషన్ దాఖలు చేశాయి. ఎస్ఈసీ కూడా సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది. దీంతో సుప్రీం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. సర్కారు కూడా సుప్రీం ఆదేశాల ప్రకారమే ముందుకు సాగుతామని చెబుతోంది.