Telugu Gateway
Andhra Pradesh

ఆంధ్ర ప్రదేశ్ సర్కారులో వింత పోకడలు !

ఆంధ్ర ప్రదేశ్ సర్కారులో వింత పోకడలు !
X

పేరుకు మాత్రం తమది పొలిటికల్ గవర్నెన్స్ అని చెపుతారు. కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు సీఎం అయినా కూడా రాజకీయ నాయకుల కంటే...ఎక్కువగా కొంత మంది ఐఏఎస్ అధికారుల హవానే నడుస్తుంది అనే ప్రచారం టీడీపీ వర్గాల్లోనే ఉంది. ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళు సదరు ఐఏఎస్ అధికారులు తమ మాట వింటూ..తాము చెప్పినట్లు చేస్తే చాలు మంత్రులను పెద్దగా పట్టించుకోకపోయినా పర్వాలేదు అన్నట్లు వ్యవహరిస్తుంటారు చంద్రబాబు నాయుడు. అది ఈ టర్మ్ లో మాత్రం కొత్త పుంతలు తొక్కినట్లు కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది. అటు మంత్రులు అయినా..ఇటు అధికారులు అయినా నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అలా కాకుండా అంతా మా ఇష్టం అంటే ప్రభుత్వాలు మారినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోకతప్పదు. ఇవి అన్ని కూడా అప్పటి పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటాయి. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని పనులు చూసే సీఆర్ డీఏ కమిషనర్ విజయరామరాజు వర్కింగ్ స్టైల్ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలోనే కాదు...ఐఏఎస్ అధికారుల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది.

ఆయన ఈ బాధ్యతల్లోకి వచ్చినప్పటి నుంచి మున్సిపల్ మంత్రి నారాయణను ఏ మాత్రం పట్టించుకోకుండా ఆయన సీఆర్ డీఏ లో సూపర్ బాస్ గా వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం మంత్రి నారాయణకు చెక్ పెట్టాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకోవటం ఒకటి అయితే..మరొకటి ఇక నుంచి సిఆర్ డీ ఏ అంతటిని తన కంట్రోల్ లో పెట్టుకోవాలని ప్రభుత్వంలో అంతా తానే అయి చక్రం తిప్పుతున్న మంత్రి నిర్ణయించుకోవటంతోనే ఇది అంతా సాగుతోంది అని చెపుతున్నారు. దారుణమైన విషయం ఏమిటి అంటే సీఆర్ డీఏ కు చెందిన అధికారులు ఎవరైనా సరే మంత్రిని కలవాలన్నా కూడా తన పర్మిషన్ తీసుకోవాలని సీఆర్ డీఏ కమిషనర్ అధికారులను ఆదేశించినట్లు ఆ శాఖ వర్గాలు చెపుతున్నాయి. మంత్రి ఎవరినైనా నేరుగా పిలిచినా సరే తనకు చెప్పే, అనుమతి తీసుకుని వెళ్లాలని మౌఖికంగా ఆదేశించటం ఇప్పుడు ఆ శాఖ లో పెద్ద దుమారం రేపుతోంది.

మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు...అత్యంత కీలకమైన సి ఆర్ డీఏ కమిషనర్ కు మధ్య ఇంత గ్యాప్ ఉంటే అసలు రాజధాని పనులు ఎలా ముందుకు సాగుతాయో అర్ధం కావటం లేదు అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అందరూ కలిసి ముందుకు సాగితేనే పనులు సకాలంలో పూర్తి చేయటం కష్టం అని..అలాంటిది ఒక మంత్రి , అధికారి మధ్య ఈ స్థాయిలో విబేధాలు గతంలో ఎప్పుడూ చూసి దాఖలాలు లేవు అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. సీఆర్ డీఏ లో చోటు చేసుకుంటున్న వివాదాలు ఇంకెన్ని మలుపులు తీసుకుంటాయో వేచిచూడాల్సిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పరిస్థితి సరిదిద్దటానికి ప్రయత్నం చేస్తారా..లేక అలాగే కొనసాగినిస్తారా అన్నది చూడాలి. దీని ఆధారంగానే అసలు విషయం బయటకు వస్తుంది అనే అభిప్రాయం కూడా ఆ శాఖ వర్గాల్లో ఉంది.

Next Story
Share it