వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సారధ్యంలోని ప్రతినిధులు కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలు కూడా ఇందులో ఉన్నారు. ఈ పరిశ్రమ ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉందని, ప్రభుత్వ రంగ సంస్థలలో నవరత్నగా నిలిచిన విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్‌కే ఆభరణం వంటిదని తెలిపారు. 35 వేల మంది ఉద్యోగులు, కార్మికులతోపాటు లక్షకుపైగా కుటుంబాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌పై ఆధారపడి జీవనోపాధిని కొనసాగిస్తున్నాయని వెల్లడించారు.
''విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఉత్పతి అయ్యే స్టీల్ నాణ్యతలో ప్రపంచస్థాయి సంస్థలకు పోటీ ఇస్తుంది. అలాంటి సంస్థ కేవలం సొంతంగా గనులు లేకపోయినందునే నష్టాలను చవిచూడాల్సి వస్తోంది'' అని అన్నారు. ''కేవలం ఇనుప ఖనిజాన్ని మార్కెట్ రేటుకు కొనుగోలు చేయడం కోసమే ఆర్‌ఐఎన్‌ఎల్ ఏటా 300 కోట్ల రూపాయలను అదనంగా భరించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల దృష్ట్యా ఆర్‌ఐఎన్‌ఎల్‌కు సొంత గనులు కేటాయించి, అప్పులను ఈక్విటీ కింద మారిస్తే అతి తక్కువ కాలంలోనే విశాఖ ఉక్కు తిరిగి లాభాల బాట పడుతుంది. తద్వారా ఆ లాభాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి భారీగా డివిడెండ్లు చెల్లిస్తుంది''అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజయసాయిరెడ్డి సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు.