Telugu Gateway
Andhra Pradesh

వ్యాక్సిన్ గ్లోబ‌ల్ టెండ‌ర్ల‌పై రాష్ట్రాల హ్యాండ్స‌ప్

వ్యాక్సిన్ గ్లోబ‌ల్ టెండ‌ర్ల‌పై రాష్ట్రాల హ్యాండ్స‌ప్
X

ఒక్క‌రూ రాలేద‌న్న సీఎం జ‌గ‌న్

అంద‌రూ కేంద్రం ద‌గ్గ‌ర ఒకే గొంతుక విన్పిద్దాం

కేంద్రంలోని మోడీ స‌ర్కారు దేశంలోని 18నుంచి 44 సంవ‌త్స‌రాల పైబ‌డిన వారికి కూడా వ్యాక్సిన్లు వేయ‌టానికి అనుమ‌తిస్తూ కొద్దిరోజుల‌ క్రితం నిర్ణ‌యం తీసుకుంది. ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన వెంట‌నే ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితోపాటు తెలంగాణ సీఎం కెసీఆర్ కూడా తామే ప్ర‌జ‌ల‌కు ఉచితంగా వ్యాక్సిన్ వేయించుతాం అని ప్ర‌క‌టించారు. ఆ ఖ‌ర్చు అంతా రాష్ట్రాలే భ‌రిస్తాయ‌ని పేర్కొన్నారు.అంతే కాదు..ఇత‌ర రాష్ట్రాల‌తోపాటు ఏపీ, తెలంగాణ‌లు కూడా వ్యాక్సిన్ల కోసం గ్లోబ‌ల్ టెండ‌ర్లు పిలిచాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ల కొర‌త తీవ్రంగా ఉంది. దీంతోపాటు ఈ రాష్ట్రాలు గ్లోబ‌ల్ టెండ‌ర్లు పిలిచేనాటికి అసలు విదేశీ టీకాల‌కు దేశంలో అనుమ‌తేలేదు. తాజాగా డీసీజీఐ అనుమ‌తులు మంజూరు చేసింది. అయితే వ్యాక్సిన్ల కొనుగోలు వ్య‌వ‌హారం రాష్ట్రాల వ‌ల్ల కాద‌ని తేలిపోతోంది. మ‌రో వైపు కేంద్రం మాత్రం చోద్యం చూస్తోంది. ప్ర‌క‌ట‌న‌లు అయితే చేస్తూ పోతుంది కానీ..దీనికి సంబంధించిన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక అంటూ పెద్ద‌గా ఖ‌రారు అయిన దాఖ‌లాలు క‌న్పించ‌టంలేదు. ఇప్ప‌టికే వ్యాక్సిన్ కు సంబంధించిన అంశంపై కేర‌ళ‌, ఒరిస్సా ముఖ్య‌మంత్రులు ఇప్ప‌టికే లేఖ‌ల ద్వారా స్పందించారు. కేంద్ర‌మే వ్యాక్సిన్లు కొనుగోలు చేసి స‌ర‌ఫ‌రా చేయాల‌న్నారు. గ్లోబ‌ల్ టెండ‌ర్ల పేరుతో రాష్ట్రాల మ‌ధ్య‌ అనుచిత పోటీస‌రికాద‌న్నారు న‌వీన్ ప‌ట్నాయ‌క్. తాజాగా ఏపీ సీఎం వై ఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా అదే బాట ప‌ట్టారు. ఆయ‌న గురువారం నాడు వాక్సిన్ల గ్లోబల్ టెండర్లు వ్యవహరం విష‌యంలో కేరళ సీఎం పినరయ్ విజయన్‌తో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి లేఖ రాశారు. రాష్ట్రాల్లో వ్యాక్సిన్ లభ్యత విషయంలో ఉన్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని రాష్ట్రాల సీఎంలందరూ ఒకే మాట మీద ఉండాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు పిలిచినా ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదని సీఎంలకు రాసిన లేఖలో స్పష్టం చేశారు.

గ్లోబల్ టెండర్లు ఆమోదం కేంద్రం చేతుల్లో ఉందని లేఖలో ప్రస్తావించారు. వ్యాక్సిన్ లభ్యత విషయంలో కేంద్రం వర్సెస్ రాష్ట్రాలు అన్నట్టు పరిస్థితి మారుతోందని లేఖలో సీఎం జగన్‌ పేర్కొన్నారు. అమెరికాకు చెందిన ఫైజ‌ర్, మోడెర్నా వంటి సంస్థ‌లు ముందే తాము కేంద్రంతో త‌ప్ప రాష్ట్రాల‌తో డీల్ చేయం అని ప్ర‌క‌టించాయి. ఇంత కాలం తాము వ్యాక్సిన్లు తెచ్చుకుని తామే వేసుకుంటామంటూ ప్ర‌క‌టించిన నేత‌లు ఒక్కొక్క‌రు కేంద్రం వైపు చూస్తున్నారు. మ‌రి కేంద్రం వీరి డిమాండ్ల మేర‌కు..అంద‌రికీ స‌రిప‌డిన‌న్ని వ్యాక్సిన్ల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌గ‌లుగుతుందా?. ఈ స‌మ‌స్య ఇంకా ఎన్ని మ‌లుపులు తిరుగుతుంది అన్న‌ది వేచిచూడాల్సిందే. మ‌రో వైపు సుప్రీంకోర్టు కూడా కేంద్ర‌వ్యాక్సినేష‌న్ విధానాన్ని తూర్పార‌ప‌ట్టింది. కొంత మందికి ఉచిత వ్యాక్సిన్ వేసి..మిగిలిన వారికి డ‌బ్బులు తీసుకోవ‌టం ఎలా స‌మ‌ర్ధించుకుంటార‌ని ప్ర‌శ్నించింది. అదే స‌మ‌యంలో కేంద్రం, రాష్ట్రాలకు స‌ర‌ఫ‌రా చేసే వ్యాక్సిన్ల ధ‌ర‌ల్లో వ్య‌త్యాసాల‌పైనా సుప్రీంకోర్టు కీల‌క‌వ్యాఖ్య‌లు చేసింది.

Next Story
Share it