Telugu Gateway
Andhra Pradesh

ఈ స్పీడ్ తో అయితే పనులు కష్టమే!

ఈ స్పీడ్ తో అయితే పనులు కష్టమే!
X

అమరావతిలో ప్రస్తుతం సాగుతున్న పనులు ఇదే స్పీడ్ తో సాగితే వచ్చే ఎన్నికల నాటికి రాజధానికి ఒక రూపుకు వస్తుందా అంటే అనుమానమే అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే అమరావతిలో అన్నీ కలుపుకుని ఇప్పటికే దగ్గర దగ్గర అరవై వేల కోట్ల రూపాయల పనులు అప్పగించారు. ఫస్ట్ టర్మ్ లో పెండింగ్ లో ఉన్న పనులు ఒక్కటే ఇప్పుడు కాస్త స్పీడ్ గా పూర్తి చేస్తున్నారు. వీటితో పాటు కొన్ని రోడ్ పనులు మాత్రం ఒకింత స్పీడ్ గానే సాగుతున్నాయి. అయితే అత్యంత కీలకమైన భవనాల పనులు ఇంకా మందగొడిగానే నడుస్తున్నట్లు అధికారులు చెపుతున్నారు. టీడీపీ నేతలు కూడా ఎక్కువ మంది ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ఏకంగా అరవై వేల కోట్ల రూపాయల పనులు కేవలం మూడేళ్ళలో పూర్తి చేయాలంటే ఈ స్పీడ్ ఏ మాత్రం అంటే ఏ మాత్రం సరిపోదు.

ఒక్క మాటలో చెప్పాలంటే అమరావతిలో ఇప్పుడు ఒక రకమైన యుద్ధవాతారణం తరహాలో పనులు సాగాలి కానీ...ప్రస్తుతానికి ఆ పరిస్థితి ఏ మాత్రం లేదు అన్నది ఎక్కువ మంది చెపుతున్న మాట. అమరావతి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సారి గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అవసరం అయినప్పుడు సిఆర్డీఏ సమావేశాలు పెట్టి కాంట్రాక్టులు ఓకే చేయటం...ఆ తర్వాత క్యాబినెట్ లో వాటిని ఆమోదించటం మినహా రాజధానిలో పనులు సాగుతున్న అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతగా ఫోకస్ పెట్టడం లేదు అన్నది టీడీపీ నేతల అభిప్రాయంగా కూడా ఉంది. చేపట్టిన పనులు పూర్తి చేయటంపై ఫోకస్ పెట్టడం మానేసి..ఎప్పటికప్పుడు కొత్త పనుల కోసం..కొత్త ప్రాజెక్ట్ ల వెంట పడటం ఎక్కువ అయింది అని...ఇది రాబోయే రోజుల్లో లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తుంది అన్నది అనే చర్చ రాజకీయ, అధికార వర్గాల్లో సాగుతోంది.

అమరావతి అంశాన్ని పూర్తి గా నారాయణ కు వదిలేస్తే నిండా మునగడం ఖాయం అని ఆ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ టర్మ్ లో పోలవరం ప్రాజెక్ట్ తో పాటు అమరావతి పై స్పెషల్ ఫోకస్ పెట్టి వారం వారం సమీక్షలు నిర్వహించేవారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ పై నిత్యం సమీక్ష చేయటం వల్ల పెద్దగా ఒనగూరే ప్రయోజనం ఏమి లేకపోవటంతో చంద్రబాబు దాన్ని వదిలేసారు అని...అమరావతిలో కాంట్రాక్టులు ఇచ్చేసి ఉండటంతో ఇది ఇక ఎక్కడకు పోదు అన్న ధీమాతో వేరే అంశాలపై ఫోకస్ పెట్టి వీటిని వదిలేస్తున్నారు అని ఒక సీనియర్ మంత్రి విశ్లేషించారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే రాజధానిగా అమరావతి ని నిర్ణయించిన తర్వాత వెలగపూడి లో కట్టిన తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ భవనాల డిజైన్ల దగ్గర నుంచి లోపాలు సౌకర్యాలు దారుణంగా ఉన్నాయనే విమర్శలు అప్పటిలోనే అధికార టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచే వినిపించాయి.

దిగ్గజ సంస్థలు కట్టిన ఈ సెక్రటేరియట్ భవనాల లీకేజీలు అప్పటిలో పెద్ద ఎత్తున ప్రభుత్వ పరువు కూడా తీశాయి. కొత్తగా కట్టిన తాత్కాలిక అసెంబ్లీ లాబీలు ఎంతో ఇరుకుగా ఉన్నాయని విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపించాయి అప్పటిలో. ఇప్పుడు కట్టే ఐకానిక్ భవనాల తో పాటు ఇతర నిర్మాణాల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టే వ్యవస్థ లేకపోతే తర్వాత కూడా ఇదే తరహాలో విమర్శలు పాలు కావాల్సి వస్తుంది అని అధికారులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ప్రభుత్వ పెద్దలు ఎంత సేపూ ఎవరికీ కాంట్రాక్టులు ఇవ్వాలా...ఎవరికీ పనులు అప్పగించాలా అనే అంశంపై పెట్టే ఫోకస్ పనులపై పెట్టడం లేదు అన్నది ఎక్కువ మందిలో ఉన్న అభిప్రాయం.

Next Story
Share it