Telugu Gateway
Andhra Pradesh

ఏమి కావాలంటే అవి ఇస్తాం అంటే!

ఏమి కావాలంటే అవి ఇస్తాం అంటే!
X

‘మీకు కావాలంటే అన్ని వివరాలు అందిస్తాం. అన్ని డాక్యుమెంట్స్ చూపిస్తాం. ఇదీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణ రెడ్డి దగ్గరి నుంచి కొంత మంది అధికారులు చెపుతున్న మాట. ఇది అంతా కూడా స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ ను సమర్ధించుకునేందుకు జగన్ సర్కారు పడుతున్న కష్టాలు.’ ఈ స్కాం లో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెపుతున్న ప్రభుత్వం వీటిని ఇవ్వాల్సింది కోర్టు కు కానీ..మీడియా కు కాదు. పైగా అవినీతి, అక్రమాలు అని ఆరోపిస్తూ ఇందులో అంతిమ లబ్ధిదారు చంద్రబాబు అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయటంలో కూడా అధికార వైసీపీ ఇప్పటివరకు విఫలం అయింది అనే అభిప్రాయం అధికారుల్లో ఉంది. మరో వైపు తెలుగు దేశం పార్టీ తో పాటు మీడియా కూడా సమగ్రంగా స్కిల్ డెవలప్ మెంట్ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున వివరాలు బహిర్గతం చేస్తోంది. టీడీపీ హయాంలో ఎన్ని లక్షల మందికి శిక్షణ ఇచ్చారు...ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి...ఎక్కడెక్కడ క్లస్టర్లు ఏర్పాటు చేశారు అనే వివరాలను అధికారికంగా చెపుతోంది. అంతే కాదు 2019 సంవత్సరంలో స్కిల్ డెవలప్ మెంట్ విషయంలో దేశంలోని బెస్ట్ స్టేట్స్ లో ఆంధ్ర ప్రదేశ్ ఒకటికి గా సీఎం జగన్ ఫోటో తో ప్రచారం చేసుకున్నారు. జగన్ సీఎం అయిందే 2019 మే లో. అంటే జగన్ సీఎం అయిన నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్ ను జగన్ స్కిల్ డెవలప్ మెంట్ విషయంలో అగ్రస్థానంలో నిలిపే అవకాశం లేదు. అంటే ఇది ఖచ్చితంగా గత ప్రభుత్వం అంటే తెలుగు దేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే అని చెప్పాలి.

ఇవన్నీ చూస్తే తెలుగు దేశం పార్టీ ఆరోపిస్తున్నట్లు చంద్ర బాబు అరెస్ట్ రాజకీయ కక్షతో జరిగింది అనే ఆరోపణలకు బలం చేకూరుతుంది అనే చర్చ వైసీపీ నేతల్లో కూడా సాగుతోంది. అందుకే సజ్జల రామకృష్ణా రెడ్డి తో పాటు అధికారులు కూడా వరస పెట్టి మీడియా సమావేశాలు పెట్టి తాము నిబంధనల ప్రకారమే చేశాం అనే పదే పదే చెప్పుకోవాల్సి వస్తోంది . చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం విషయం లో విజయవాడలో మీడియా సమావేశాలు పెట్టిన తర్వాత కూడా మళ్ళీ సిఐడీ చీఫ్ సంజయ్, ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైదరాబాద్ లో మీడియా సమావేశం పెట్టారు అంటే ప్రభుత్వం చెపుతున్న విషయాలు ప్రజలు పెద్దగా నమ్మటం లేదు..ఇది ప్రభుత్వానికి నష్టం చేసేలా ఉంది అనే కారణంతో ఇది అంతా చేస్తున్నారు అనే చర్చ సాగుతోంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ప్రభుత్వాన్ని సమర్థిస్తూ మాట్లాడే వారి మాటల వల్ల జగన్ సర్కారు క్రెడిబిలిటీ ఇండెక్స్ దారుణంగా క్రాష్ అయింది అని ఒక ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇప్పటికే అరెస్ట్ అయి జైలు లో ఉన్నారు. ఇందులో స్కాం జరిగిందా లేదా అన్నది ఇక తేల్చాల్సింది కోర్టు మాత్రమే. కానీ ఈ లోగా తెలుగు దేశం పార్టీ, మీడియా ద్వారా విడుదల చేస్తున్న విషయాలు చూస్తే మాత్రం ప్రభుత్వంపైనే అనుమానాలు వచ్చేలా ఉన్నాయనే చర్చ సాగుతోంది. లాజికల్ గా ఆలోచిస్తే తెలుగు దేశం బహిర్గతం చేసే వివరాలను వైసీపీ సరిగా కౌంటర్ చేయలేకపోతోంది అనే అభిప్రాయం నెలకొంది అనే చెప్పాలి. ఎంత సేపూ షెల్ కంపెనీ లు అంటూ ఆరోపణలు చేస్తారు కానీ..కీలక విషయాలపై చర్చను దాట వేస్తుండటంతో అనుమానాలు మరింత పెరుగుతున్నాయి.

Next Story
Share it