ఇద్దరూ...ఇద్దరే

దేశ వ్యాప్తంగా సర్ పై ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతోంది. సర్ పేరుతో దేశ వ్యాప్తంగా ఏకంగా 13 కోట్ల మంది ఓట్లు తొలగించినట్లు జాతీయ మీడియా కథనాలు చెపుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఈసి) జ్ఞానేష్ కుమార్ తీరు తీవ్ర వివాదాస్పదం అవుతోంది. ఆయన ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నట్లు సిఈసి లోని ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు లేవనెత్తినట్లు మీడియాలో వార్తలు రావటంతో ఒక్కసారిగా సిఈసి వ్యవహారం మరో సారి తీవ్ర చర్చనీయాంశగా మారింది. ఈ వ్యవహారంపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించిన తీరు చూసిన తర్వాత అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు నాయుడు దేశంలోనే ఒక ఐకాన్ గా నిలుస్తారు అనే చర్చ సాగుతోంది. సర్ గోల్ మాల్ వ్యవహారంపై లోక్ సభలో టీడీపీ పక్ష నాయకుడు లావు శ్రీకృష్ణదేవ రాయలు ప్రజల్లో ఉన్న అనుమానాలను ఈసీ నివృత్తి చేయాలన్నారు. దేశ వ్యాప్తంగా సర్ వ్యవహారంపై దుమారం రేగటంతో సీఈసీ శనివారం నాడు సమావేశం అయి పలు వివరణలు ఇచ్చింది. దీంతో పరోక్షంగా గతంలో కొన్ని తప్పులు జరిగినట్లు అనధికారికంగా అంగీకరించినట్లు అయింది.
ఈసీ ప్రకటనపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. రాజ్యాంగ సంస్థలను గౌరవించటం అత్యంత ముఖ్యం అని...దేశ ప్రజాస్వామ్య ప్రక్రియపై విశ్వాసం నిలబెట్టడం పార్టీలకు అతీతంగా నాయకులందరి ఉమ్మడి బాధ్యత అన్నారు. సర్ పై ముగ్గురు కమిషనర్లు ఉమ్మడిగా చేసిన ప్రకటనతో అపోహలు అన్ని తొలగిపోయాయి అని చెప్పుకొచ్చారు. ఇదే చంద్రబాబు నాయుడు 2019 ఏప్రిల్ లో ఒక ట్వీట్ చేసి దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు అన్ని దాడికి గురవుతున్నాయి అని...మోడీ ఒక పద్ధతి ప్రకారం దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థల స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీశారు అని తీవ్ర విమర్శలు చేశారు. సిబిఐ, ఆర్ బిఐ తో పాటు రాజ్యాంగ బద్ద సంస్థ ఎలక్షన్ కమిషన్ ను కూడా వదిలిపెట్టలేదు అని విమర్శించారు. ఇప్పుడు మాత్రం ఒక కంటి తుడుపు ప్రకటనతో అంతా సెట్ అయింది అని చెప్పుకొస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే చందబాబు నాయుడు ఏకంగా ఎన్నికల సమయంలో అప్పటి సీఈఓ గోపాల కృష్ణ ద్వివేది కార్యాలయానికి వెళ్లి మరీ ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటమే కాకుండా నిరసన వ్యక్తం చేశారు. అప్పటిలో ఇది పెద్ద దుమారమే రేపింది.
చంద్రబాబు నాయుడు సంగతి ఇలా ఉంటే వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇదే జగన్ మోహన్ రెడ్డి కి చెందిన వైసీపీ కేంద్రంలో మోడీ సర్కారు తీసుకొచ్చిన ఎన్నికల కమిషనర్ల నియామకానికి చెందిన సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చింది. గతంలో ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో ప్రధాని, సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నాయకుడు సభ్యులుగా ఉండేవాళ్ళు. మోడీ సర్కారు సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ప్లేస్ లో ప్రధాని నియమించే కేంద్ర మంత్రిని ఈ కమిటీలో ఉండేలా మార్పులు చేసింది. దీంతో అధికారంలో ఉన్న పార్టీ కి చెందిన వాళ్ళు ఎవరు చెపితే వారి పేరు ఫైనల్ అయ్యే పరిస్థితి వచ్చేసింది. సర్ వివాదం తెరమీదకు వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు పాత విధానం తీసుకురావాలని కోరుతున్నారు. ఈ కమిటీలో సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి సభ్యుడిగా ఉండేలా చూడాలని కోరుతున్నారు.



