Telugu Gateway
Andhra Pradesh

విస్తుపోతున్న టీడీపీ మంత్రులు..నేతలు

విస్తుపోతున్న టీడీపీ మంత్రులు..నేతలు
X

జానారెడ్డి కొడుకు కంపెనీకి ఏపీలో 8240 కోట్ల రూపాయల ప్రాజెక్ట్

ఎస్ఐపీబి లో ఆమోదం తెలిపిన చంద్రబాబు

వైసీపీ ఐదేళ్ల పాలనలో పెద్ద ఎత్తున లబ్ధిపొందిన వారిలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్..ఇండో సోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి. ఇప్పటికి ఇంకా కూటమి ప్రభుత్వంలో ఈ కంపెనీల హవానే నడుస్త్తోంది అనే చర్చ టీడీపీ వర్గాల్లో కూడా ఉంది. మరో వైపు జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఈ రెండు కంపెనీలకు కలిపి లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టులు కట్టబెట్టి పెద్ద ఎత్తున ప్రయోజనం కల్పించారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో టీడీపీ నేతలు వీటిపై తీవ్ర విమర్శలు చేశారు కూడా . కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా అనుచిత లబ్ధిపొందిన కంపెనీలపై యాక్షన్ సంగతి అటుంచి అదే సంస్థలకు మరింత మేలు చేకూరే నిర్ణయాలు తీసుకోవటం ఇప్పుడు టీడీపీ నాయకులను కూడా విస్మయానికి గురి చేస్తోంది. కొద్ది రోజుల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వంలో వైసీపీ నేతలకు ఎలాంటి పనులు చేయకూడదు అని....అలా చేస్తే పాముకు పాలు పోసి పెంచినట్లే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీన్ కట్ చేస్తే జగన్ మోహన్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడిగా పేరున్న విశ్వేశ్వర్ రెడ్డి కంపెనీ ఇండ్ సోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా రాష్ట్రంలో 58469 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కేటాయించింది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు అద్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సహక బోర్డు (ఎస్ ఐపీబి) గురువారం నాడు ఆమోదం తెలిపింది. ఈ కంపెనీ ప్రాజెక్ట్ ఎక్కడ పెడుతుందో చెప్పకుండానే...ఈ యూనిట్ ద్వారా 3050 మందికి ఉద్యోగాలు వస్తాయని చూపించారు. అసలు అటు షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్, ఇండ్ సోలార్ కంపెనీల పేర్లు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి అంటే జగన్ హయాంలోనే అనే సంగతి అందరికి తెలిసిందే. ఒక వైపు క్యాడర్ కు అలా చెప్పిన చంద్రబాబు తాము మాత్రం పై స్థాయిలో వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ లు జగన్ సన్నిహితులకు కేటాయిస్తాం...వాళ్ళ మనుషుల జోలికి కూడా వెళ్ళం...మీరు మాత్రం అంతా తాము చెప్పినట్లు చేయండి అన్న చందంగా వ్యవహరిస్తున్నారు అని టీడీపీ నాయకులు కూడా వాపోతున్నారు. ఇండ్ సోల్ సంగతి అలా ఉంటే గురువారం నాడు చంద్రబాబు క్లియర్ చేసిన ప్రాజెక్ట్ లో మరో ఆసక్తికర విషయం ఉంది.

అదేంటి అంటే మాజీ మంత్రి, తెలంగాణ కు చెందిన సీనియర్ నేత జానారెడ్డి తనయుడు జయవీర్ కుందూరు డైరెక్టర్ గా ఉన్న కంపెనీ ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ అన్నమయ్య, కడప జిల్లాల్లో 8240 కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రాజెక్ట్ పెట్టనుంది. ఇందులో మరో డైరెక్టర్ గా కేశవరెడ్డి మెరెడ్డి ఉన్నారు. కొత్తగా ఎస్ఐపీబి పది కంపెనీలకు ఆమోదం తెలపగా..వీటి ద్వారా పెట్టుబడి 121659 కోట్ల రూపాయలు వస్తుంది అని తెలిపారు. ఇక్కడ మరో కీలక అంశం ఏమిటి అంటే ఇందులో ఒక్క ఐటి ప్రాజెక్ట్ లేకపోయినా టీడీపీ పేస్ బుక్ అధికారిక పేజీ లో మాత్రం పరిశ్రమల శాఖ మంత్రి టి జి భరత్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ల ఫోటోలు పెట్టకుండా రాష్ట్రానికి ఏమి సాధించినా కూడా చంద్రబాబు, నారా లోకేష్ లు మాత్రమే...మిగిలిన వాళ్ళు అంతా డమ్మీలే అనే సంకేతం పార్టీ నే ఇవ్వటం ఏ మాత్రం సరికాదు అనే చర్చ మంత్రుల్లో సాగుతోంది.

Next Story
Share it