వారాంతంలోగా ఐఏఎస్ ల బదిలీలు!

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తర్వలోనే ఐఏఎస్ ల బదిలీలు చేపట్టనుంది. పలు జిల్లాల కలెక్టర్ల తో పాటు కొంత మంది కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళను కూడా మార్చనున్నట్లు అధికార వర్గాలు చెపుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఇటీవల ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఈ ఏడాది కాలంలో అధికారుల పనితీరు ఆధారంగా మార్పులు చేసే అవకాశం ఉంది అని చెపుతున్నారు. త్వరలో జరగనున్న బదిలీల్లో ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం టి కృష్ణ బాబు ఉంటారు అని అధికార వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ బదిలీ ఎప్పుడో జరగాల్సి ఉన్నా కూడా యోగాంధ్ర నోడల్ అధికారిగా ఉండటంతో ఆలస్యం అయింది అని చెపుతున్నారు. మరో వైపు గత కొంత కాలంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ కు కృష్ణ బాబు కు మధ్య గ్యాప్ బాగా పెరిగింది అనే ప్రచారం అధికార వర్గాల్లో ఉంది. ఇదే విషయంలో సీఎం చంద్రబాబు దగ్గరికి పలు ఫిర్యాదులు కూడా వెళ్లాయని ఒక మంత్రి వెల్లడించారు. ఈ శాఖలో కృష్ణ బాబు ఎక్కువగా తన సొంత నిర్ణయాలతోనే వెళుతున్నారు అని ఆయన తెలిపారు. ఇవి అన్నీ దృష్టిలో పెట్టుకుని త్వరలో జరగనున్న ఐఏఎస్ ల బదిలీల్లో ఆయనపై బదిలీ వేటు పడే అవకాశం ఉంది చెపుతున్నారు. మరో వైపు అమరావతికి సంబంధించి సాగుతున్న వ్యవహారాల్లో ఒకింత ఉక్కపోత ఎదుర్కొంటున్న ఆ శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్ కూడా తనను ఈ శాఖ నుంచి తప్పించాలని కోరుతున్నట్లు అధికార వర్గాలు చెపుతున్నాయి.
ప్రధానంగా అమరావతిలో సాగుతున్న టెండర్ల వ్యవహారంలో పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే మంత్రి నారాయణ కృష్ణ బాబు ను తమ శాఖ కు కేటాయించాలని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కృష్ణబాబు మాత్రం టీటీడీ ఈఓ తో పాటు సీఎంఓ లో ప్లేస్ కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు అని...ఈ రెండు ఛాన్స్ లు ఉండే అవకాశం లేదు అని...మరి మంత్రి నారాయణ కోరుతున్నట్లు కృష్ణ బాబు ను మున్సిపల్ శాఖకు బదిలీ చేస్తారా లేక మరో చోటకు మారుస్తారా అన్నది కొద్ది రోజుల్లో కానీ తెలవదు. సచివాలయంలోని కీలక శాఖలు చూస్తున్న అధికారులతో పాటు పలు జిల్లా కలెక్టర్లకు కూడా స్దాన చలనం ఉంటుంది అని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ బదిలీలు కూడా ఈ వారాంతంలోగా జరిగే అవకాశం ఉంది అని ఒక ఉన్నతాధికారి తెలిపారు.



