ప్రతిపక్షంలోనూ భయపెడుతున్న జగన్ !

అధికారంలో ఉన్నప్పుడు అందరిని భయపెట్టారు. అందుకే మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అంత దారుణంగా ఓడిపోయింది. చంద్రబాబు ఇచ్చిన హామీల కంటే జగన్ పాలన వద్దు అనుకుని ఓట్లు వేసిన వాళ్లే ఎక్కువ మంది. అయినా సరే ఇప్పుడు హోదా లేకపోయినా ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా వైసీపీ అదే మోడల్ ను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గత రెండు పర్యటనలు చూస్తే వైసీపీ ప్రజలకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తుందా..లేక మరింత దూరం చేసుకుంటుందా అన్న చర్చ ఆ పార్టీ నాయకుల్లో కూడా సాగుతోంది. ఇదే ట్రెండ్ రాబోయే రోజుల్లో కూడా కొనసాగితే రాజకీయంగా మరింత ఇబ్బందులు తప్పవనే వ్యాఖ్యలు వైసీపీ నాయకుల నుంచి వినిపిస్తున్నాయి. అధికార పార్టీ తప్పులు చేస్తే వాటిని ఎత్తిచూపాలి..వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. ఏ రాజకీయ పార్టీ అయినా చేయాల్సిన పని అదే. కానీ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ గత కొంత కాలంగా చేస్తున్న పనులు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి కొద్ది రోజుల క్రితం తెనాలిలో నేర చరిత్ర ఉన్న వాళ్ళను పరామర్శించటానికి వెళ్లి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. బుధవారం నాడు జగన్ తలపెట్టిన పల్నాడు జిల్లా రెంటపాళ్ల సందర్శన కూడా కొత్త వివాదానికి తెర తీసింది అనే చెప్పాలి. జగన్ పర్యటన సందర్భంగా కొంత వైసీపీ క్యాడర్ బహిరంగంగా ప్రదర్శించిన పోస్టర్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
‘2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ సి పీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రపా రపా నరుకుతాం ఒక్కొక్కడిని. రాజారెడ్డి రాజ్యాంగం అమలు పల్నాడు నుంచే మొదలు. ఎవడైనా రాని తొక్కి పడేస్తాం. అన్న వస్తాడు. అంతు చూస్తాడు. ’ వంటి నినాదాలు ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. ఇవే కాదు..ఇంకొన్ని భూతులతో కూడిన నినాదాలు కూడా ఉన్నాయి. ఇవి అన్నీ చుసిన వాళ్ళు జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు ఎలాంటి సంకేతం పంపాలి అనుకుంటున్నారో అని కామెంట్స్ చేస్తున్నారు. ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నించాలి కానీ..ప్రతి పర్యటనలోనూ ఇలాంటి వాటితో సెల్ఫ్ గోల్ వేసుకునే లీడర్ గా జగన్ మోహన్ రెడ్డి రికార్డు లకు ఎక్కేలా ఉన్నారు అని ఒక సీనియర్ వైసీపీ నేత వ్యాఖ్యానించారు. అయితే ఇలా చేయటం తప్పు అని జగన్ కు చెప్పే సాహసం వైసీపీ లో ఎవరూ చేయరు అనే విషయం తెలిసిందే. జగన్ పర్యటనలకు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు. అందుకే ప్రభుత్వం కూడా తాజా పర్యటనపై విషయంలో కూడా పలు ఆంక్షలు పెట్టింది. పోలీసుల ఆంక్షలను కాదని పెద్ద ఎత్తున జనాలు జగన్ కార్యక్రమానికి వచ్చారు. అయితే ఈ వివాదాస్పద ప్లకార్డులతో మొత్తం వ్యవహారం పక్కకు పోయినట్లు అయింది అని వైసీపీ నేతలే అభిప్రాయపడుతున్నారు.



