Telugu Gateway
Andhra Pradesh

ఎస్ఈసీ సంచలన నిర్ణయం

ఎస్ఈసీ సంచలన నిర్ణయం
X

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ

సర్కారు నో అన్నా....ఎస్ఈసీ షెడ్యూల్ జారీ

ఏపీ సర్కారుతో ఎస్ఈసీ ఢీ అంటే ఢీ అంటోంది. ఎన్నికల నిర్వహణకు సర్కారు ససేమిరా అంటుంటే..ఎస్ఈసీ మాత్రం ఏకంగా ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తో కూడిన బృందం ఎస్ఈసీతో సమావేశం అయి వెళ్లిన తర్వాత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యూల్ జారీ చేయటం కలకలం రేపుతోంది. అయితే సర్కారు దీనిపై ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. గత కొంత కాలంగా ఎస్ఈసీ, సర్కారు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు సీఎస్ తోపాటు అధికారులు ఎస్ఈసీతో సమావేశం అయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపటికే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 23న తొలి దశ,27న రెండవ దశ, 31న మూడవ దశ, ఫిబ్రవరి 4న నాలుగో దశ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. శనివారం నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుందని తెలిపారు.

నాలగవ దశ పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరి 17న ముగియనున్నాయి. అంతకు ముందు ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ ప్రసాద్‌తో సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, అధికారుల భేటీ అయ్యారు. ఎస్‌ఈసీతో గంటన్నరపాటు సీఎస్‌ బృందం సమావేశం కొనసాగింది. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కారణంగా ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని సీఎస్‌ బృందం తెలిపింది. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముగిసే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఈ నెలలో ప్రారంభం కాబోతోందని, రాష్ట్రంలో ఇప్పటికే రెండుసార్లు వ్యాక్సినేషన్‌ డ్రైరన్‌ నిర్వహించామని సీఎస్‌ బృందం పేర్కొంది.

కేంద్రం సూచనలతో ఇవాళ కూడా డ్రైరన్‌ నిర్వహించామన్నారు. తొలి విడతగా కోటిమందికి వ్యాక్సినేషన్‌ వేయాల్సి ఉందని, 5 కోట్ల మందికి రెండు డోసుల చొప్పున వ్యాక్సినేషన్‌కు 6 నుంచి 8 నెలల సమయం పడుతుందని సీఎస్‌ బృందం తెలిపింది. రాష్ట్రంలోని యంత్రాంగమంతా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఉందని.. వాలంటీర్ల నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో విధులు నిర్వర్తించాల్సి ఉందని సీఎస్‌ తెలిపారు. అయితే ఎస్ఈసీ మాత్రం ఎన్నికల నిర్వహించాల్సిన అవశ్యకత గురించి వివరించారు. అందుకు అనుగుణంగానే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించి సుదీర్ఘ ప్రొసీడింగ్స్ ను విడుదల చేశారు ఎస్ఈసీ.

Next Story
Share it