సభాహక్కుల నోటీసుపై స్పందించిన నిమ్మగడ్డ

శాసనసభ కార్యదర్శి పంపిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. తాను ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకి రానని పేర్కొన్నారు. అదే సమయంలో తాను సభా హక్కులకు ఎక్కడా భంగం కల్పించలేదని..సభపై తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. ఈ మేరకు తన సమాధానాన్ని అసెంబ్లీ కార్యదర్శికి పంపారు. తాను కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్నానని, హైదరాబాద్‌లో ఉన్నా.. విచారణకు హాజరుకాలేనని తెలిపారు. అయితే కమిటీ ఈ అంశంపై మరింత ముందుకు వెళ్లాలని భావిస్తే తాను తగిన ఆధారాలు సమర్పిస్తానని వెల్లడించారు. అయితే దీనికి తనకు కొంత సమయం కావాలన్నారు.
తన హక్కులకు భంగం కలిగించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చిన నోటీసుపై సభాహక్కుల కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు వివరణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు శాసనసభ లేఖ రాసింది. తదుపరి విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలని కూడా కోరింది. గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తూ ఎస్‌ఈసీ తనపై ఉపయోగించిన పదజాలం కించపరచేలా ఉందని మంత్రి పెద్దిరెడ్డి...శాసనసభాపతి తమ్మినేని సీతారాంకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.



