నామినేషన్ల ఉపసంహరణపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ అంశం వివాదస్పదంగా మారుతోంది. బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపచేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మంగళవారం నాడే పెద్ద ఎత్తున నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగింది. బుధవారం మూడు గంటలకు ఇది ముగియనుంది. ఈ తరుణంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నామినేషన్ వేసిన వ్యక్తి స్వయంగా హాజరు అయితే తప్ప వీటిని అనుమతించవద్దని అన్నారు.
అంతే కాదు..ఈ ప్రక్రియ అంతా రికార్డ్ చేసి భద్రపర్చాలని జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులను ఆదేశించారు. థర్డ్ పార్టీ వచ్చి నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు చెపితే ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని స్పష్టం చేశారు. బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపచేస్తున్నట్లు ఎస్ఈసీకి పలు ఫిర్యాదులు రావటంతో ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కొన్ని చోట్ల బలవంతంగా నామినేషన్లను ఉపసంహరింపచేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు.