Telugu Gateway
Andhra Pradesh

పట్టా భూములతో పాటు ప్రభుత్వ భూములు కూడా

పట్టా భూములతో పాటు ప్రభుత్వ   భూములు కూడా
X

దేశంలో సూపర్ హిట్ అయిన మల్టీ ప్రోడక్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఎస్ఈజెడ్) ఏదైనా ఉంది అంటే కచ్చితంగా అది ఆంధ్ర ప్రదేశ్ లోనే శ్రీసిటీ నే అని చెప్పొచ్చు. అయితే వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అతి తక్కువ ధరకు శ్రీసిటీ కి వేల ఎకరాల భూములు కేటాయించడంపై పెద్ద ఎత్తున వివాదాలు నడిచాయి. అయితే ఈ ప్రాజెక్ట్ లో దేశ, విదేశాలకు చెందిన ప్రతిష్టాత్మక సంస్థలు తమ యూనిట్లను ఏర్పాటు చేయటంతో అత్యంత విజయవంతమైన సెజ్ ల్లో ఇది ఒకటిగా నిలిచింది. 2008 ఆగస్ట్ లో శ్రీసిటీ ని అధికారికంగా ప్రారంభించారు. ఆ తర్వాత ఏ మాత్రం వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా ఇందులోకి ఎన్నో కీలక కంపెనీల యూనిట్స్ వచ్చాయి. గతంలోనే శ్రీసిటీ ప్రాజెక్ట్ కోసం మొత్తం 7246 ఎకరాల భూమి కేటాయించారు. ఈ కేటాయింపుల విషయంలో ఎకరా కనిష్ట ధర 3 .30 లక్షల రూపాయల నుంచి గరిష్టంగా ఎకరాకు 26 లక్షల రూపాయల వరకు ఉంది. అయితే శ్రీసిటీ లోకి వచ్చే బహుళ జాతి సంస్థలతో పాటు ఇతర యూనిట్స్ కోసం సెజ్ పక్కనే మరో 2583 ఎకరాల భూమిని సేకరించి ఇవ్వాలని కంపెనీ ప్రభుత్వానికి 2024 అక్టోబర్ 19 న ఒక వినతి పత్రం అందించింది.

ఇందులో ప్రభుత్వ భూమితో పాటు పట్టా భూములు కూడా ఉన్నాయి. సత్యవేడు మండలంలోని ఇరుగలం, రాళ్లకుప్పం, పెద్దఏటిపాకం , కొళ్ళాడం గ్రామాల్లో ఇప్పుడు 1754 ఎకరాల పట్టా భూమి, 830 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించి సత్యవేడు రిజర్వు ఇన్ఫ్రా సిటీ ప్రైవేట్ లిమిటెడ్ కు కేటాయించనున్నారు. మార్చి 13 న జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సహక బోర్డు (ఎస్ఐపీబి) సమావేశంలో ఈ భూ సేకరణ, కేటాయింపు ప్రదీపదానాలకు ఆమోదం లభించింది. దీనికి అనుగుణంగా సత్యవేడు రిజర్వు ఇన్ఫ్రా సిటీ కి 2,583.99 ఎకరాలు కేటాయించటానికి అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీఐఐసి ఎండీని ఆదేశిస్తూ పరిశ్రమల శాఖ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటు ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని టార్గెట్ గా పెట్టుకుంది. అందులో భాగంగానే శ్రీసిటీ కి ఇప్పుడు కేటాయించే అదనపు భూమిలోకి పెద్ద ఎత్తున కొత్త యూనిట్స్ వచ్చే అవకాశం ఉంది అని పరిశ్రమల శాఖ వర్గాలు చెపుతున్నాయి.

Next Story
Share it