Telugu Gateway
Andhra Pradesh

నారా లోకేష్ తెచ్చిన సత్వా చెల్లింపులకు ఈఓటి

నారా లోకేష్ తెచ్చిన సత్వా చెల్లింపులకు ఈఓటి
X

వైజాగ్ లో ఆ కంపెనీకి కేటాయించిన భూమి విలువే తక్కువలో తక్కువ 1200 కోట్ల రూపాయలు ఉంటుంది. ఒక్క భూమి కేటాయించి వదిలేయటం లేదు...ఐటి మౌలిక సదుపాయాల స్కీం కింద ఈ కంపెనీకి భారీ ఎత్తున రాయితీలు...ప్రోత్సహకాలు కూడా కల్పించబోతోంది ఏపీ సర్కారు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే పదిహేను వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే కంపెనీ ప్రభుత్వానికి నిర్దేశిత గడువులోగా 45 కోట్ల రూపాయలు చెల్లించలేకపోవటం. పోనీ ఆ కంపెనీ ఏదో చిన్న చితకా కంపెనీనా అంటే అది కాదు. మరో కీలక విషయం ఏమిటి అంటే ఒక్క ఎకరా ధరకే ఏకంగా వైజాగ్ లోని అత్యంత ఖరీదైన మధురవాడ ప్రాంతంలో ఏకంగా 30 ఎకరాలు దక్కించుకుని కూడా ఈ సంస్థ ఆ డబ్బు చెల్లించటానికి కూడా రెండు నెలలు గడువు కోరటం...అది కూడా వడ్డీ లేకుండా ఆ మొత్తం చెల్లిస్తాం అని లేఖ రాస్తే అదే మహాప్రసాదం అన్నట్లు దానికి ఓకే చేసింది ఆంధ్ర ప్రదేశ్ లోని ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని సర్కారు.

ఆ కంపెనీనే బెంగళూరు కు చెందిన సత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. 25000 మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది అని చెప్పి వైజాగ్ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2025 ఆగస్ట్ 1 న ఈ కంపెనీకి ఎకరా కోటిన్నర రూపాయల లెక్కన మధురవాడలో మొత్తంలో 30 ఎకరాలు కేటాయిస్తూ జీవో జారీ చెంసింది. దీని ప్రకారం కంపెనీ నవంబర్ ఐదు నాటికీ దీనికి సంబంధించిన 45 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అంటే ఏపీఐఐసీ కి చెల్లించాల్సి ఉంది. అయితే కంపెనీ మాత్రం ఈ గడువులోగా డబ్బు చెల్లించకుండా మరో అరవై రోజులు అదనపు గడువు కావాలని ..అది కూడా ఎలాంటి వడ్డీ లేకుండా ఈ చెల్లింపులు చేయటానికి అని ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. అయితే ఒక వైపు ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేకపోతున్న..నెల గడవాలంటే అప్పులు చేయక తప్పనిసరి పరిస్థితిలో ఉన్న

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సత్వా కోరినట్లే చేసింది. ఈ ప్రతిపాదన ను ఎస్ఐపీబి ముందు పెట్టి ఒకే చేశారు. దీని ప్రకారం కంపెనీ ఎలా వడ్డీ/పెనాల్టీ లేకుండా డిసెంబర్ 4 లోగా చెల్లింపులు చేసేందుకు ఒకే చేసింది. కంపెనీ కూడా ఈ చెల్లింపుల కోసం ఎక్స్ టెన్షన్ ఆఫ్ టైం ( ఈఓటి) తీసుకుని దాని ప్రకారం చెల్లింపులు చేసింది. దీనికి తాజాగా ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. మార్కెట్ వర్గాలు చెప్పే దాని ప్రకారం సత్వా కు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వైజాగ్ లో కేటాయించిన 30 ఎకరాల భూమి ధరే ఏకంగా తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా 1200 కోట్ల రూపాయలు ఉంటుంది అని అంచనా. ఇందులో సత్వా ఐటి స్పేస్ తో పాటు రెసిడెన్షియల్ స్పేస్ డెవలప్ చేయటానికి కూడా అనుమతి ఇచ్చారు. అయినా సరే ఈ కంపెనీ కేవలం 45 కోట్ల రూపాయలు చెల్లించటానికి రెండు నెలలు గడువు అడగటం..దీన్ని ప్రభుత్వం ఓకే చేయటం చర్చనీయాంశంగా మారింది. రెసిడెన్షియల్ స్పేస్ ను ఈ కంపెనీ నేరుగా విక్రయించుకుంటుంది...మరో వైపు ఐటి స్పేస్ ని వివిధ సంస్థలకు అద్దెకు ఇచ్చి భారీ ఎత్తున లబ్దిపొందనుంది. తాజాగా వైజాగ్ లో కాగ్నిజెంట్ తో పాటు సత్వా ప్రాజెక్ట్ కు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.

Next Story
Share it