Telugu Gateway
Andhra Pradesh

సంగం డెయిరీ స్వాధీనం జీవోను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు

సంగం డెయిరీ స్వాధీనం జీవోను సస్పెండ్ చేసిన  ఏపీ  హైకోర్టు
X

ఏపీ సర్కారుకు వరస ఎదురుదెబ్బలు

మొన్న జువారీ సిమెంట్స్.నిన్న అమరరాజా, నేడు సంగం డెయిరీ కేసులో.

ఏపీ సర్కారుకు వరస ఎదురుదెబ్బలు. మొన్న జువారీ సిమెంట్స్..నిన్న అమరరాజా బ్యాటరీస్. నేడు సంగం డెయిరీ. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు హైకోర్టులో వరస బ్రేక్ లు పడ్డాయి. అత్యంత ప్రతిష్టాత్మక కంపెనీల విషయంలో సర్కారు ఎందుకు ఇంత తొందరపాటుతో వ్యవహరిస్తుందనే అంశంపై కూడా ప్రభుత్వ వర్గాల్లో కూడా చర్చ సాగుతోంది. ఏ కంపెనీకి అయినా తగినంత సమయం ఇచ్చి ఏదైనా పొరపాట్లు ఉంటే దిద్దుబాటుకు అవకాశం ఇవ్వాలని అలా కాకుండా తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవటం సరికాదనే అభిప్రాయాన్ని కొంత మంది అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో పరిశ్రమలతోపాటు కాలుష్య నివారణ రెండూ ముఖ్యమే అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. నిజంగా జువారీ సిమెంట్స్ అయినా..అమరరాజా బ్యాటరీస్ అయినా కాలుష్య నిబంధనలు ఉల్లంఘిస్తే ఖచ్చితంగా వాటిపై చర్యలు తీసుకోవటాన్ని ఎవరూ ఆక్షేపించరు. అయితే రాష్ట్రంలో కేవలం ఈ రెండు కంపెనీలే కాలుష్య నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయా? వైజాగ్ లోని ఫార్మా సిటీలోని కంపెనీలతో పాటు ఇతర ఫార్మా సంస్థలు అన్నీ పక్కాగా కాలుష్య నిబంధనలు పాటిస్తున్నాయా అంటే ఖచ్చితంగా ఎస్..అనే చెప్పే పరిస్థితి ఉండదని పరిశ్రమల శాఖకు చెందిన సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.

సంగం డెయిరీ ఛైర్మన్ దూళిపాళ నరేంద్రను అవినీతి ఆరోపణలపై అరెస్ట్ చేయటంతోపాటు ఏపీ ప్రభుత్వం ఏకంగా సంగం డెయిరీని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సంగం డెయిరీ కమిటీ ప్రభుత్వ స్వాధీనంపై కోర్టును ఆశ్రయించగా..దీనిపై వాదోపవాదాలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. శుక్రవారం నాడు తీర్పు వెలువరించింది. సర్కారు జీవోను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుని..కంపెనీ డైరక్టర్లు రోజువారీ కార్యకలాపాలు చూసుకోవచ్చని స్పష్టం చేసింది. అదే సమయంలో సంగం డెయిరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం చెల్లదు అని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే సంగం డెయిరీ ఆస్తుల ఏదైనా అమ్మాలంటే మాత్రం హైకోర్టు అనుమతి తీసుకోవాలని పేర్కొంది. ఏ ఆస్తులు అమ్మాలన్నా..కొనాలన్నా కోర్టు అనుమతి తీసుకోవాలన్నారు.

Next Story
Share it