కొత్త జీవోల ప్రకారమే వేతనాలు
ఏపీ సర్కారు వర్సెస్ ఉద్యోగులు లడాయి నడుస్తూనే ఉంది. కొత్త జీవోల ప్రకారమే ఉద్యోగులకు జీతాలు అందుతాయని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉద్యోగులు ఏ కోరిక కోరినా సమంజసంగా ఉండాలన్నారు. రాష్ట్ర పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరించకుండా నిరసన చేస్తూనే జీతాలు ఇవ్వమంటున్నారని, తాము ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు. మాట తూలితే దానికి సంఘ నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీతో చర్చలకు ఉద్యోగ సంఘ నేతలు ఎవరూ రాలేదు. దీంతో తాజా పరిస్థితిని సీఎం జగన్ కు వివరించారు.
ఇందులో మంత్రులతోపాటు సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. పీఆర్సీ ఇచ్చిన తర్వాత ఉద్యోగులు కొన్ని సందేహాలు వ్యక్తం చేయడంతో వెంటనే ప్రభుత్వం స్పందించి కమిటీ వేసిందని బొత్స సత్యనారాయణ తెలిపారు. సమస్యలపై చర్చకు ఉద్యోగులను ఆహ్వానించామని, అయినప్పటికీ ఉద్యోగులు రాలేదన్నారు. మూడు రోజులు ఎదురు చూసినా ఉద్యోగులు రాలేదని, వాళ్లు రాకుండా ద్వితీయ శ్రేణి వాళ్లను పంపారని చెప్పారు. జీతాల బిల్లులు ప్రాసెస్ చేయకపోవటం వంటివి నిబంధనలు ఉల్లంఘింటచమే అవుతుందని తెలిపారు. తమ మూడు డిమాండ్లు పరిష్కరిస్తనే చర్చలకు వస్తామని వారు చెబుతున్నారని..ఇది క్రమశిక్షణా రాహిత్యం కిందకే వస్తుందన్నారు.