Telugu Gateway
Andhra Pradesh

రెండు చోట్లా నష్టం తప్పదనే భయం !

రెండు చోట్లా నష్టం తప్పదనే భయం !
X

అధికారంలో ఉన్నా...అధికారంలో లేకపోయినా వైసీపీ అంటే ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గొంతు సజ్జల రామకృష్ణారెడ్డి అనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు మంత్రులను పక్కన పెట్టుకుని ప్రభుత్వ విధాన నిర్ణయాలను కూడా ఆయనే ప్రకటించిన సందర్భాలు ఎన్నో. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా కూడా డోంట్ కేర్ అంటూ అదే ట్రెండ్ ను కొనసాగించారు. ఎన్నికల ముందు మాత్రం కాస్త బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నేతలకు మాట్లాడే అవకాశం దక్కింది. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా ఎక్కువగా సజ్జల రామక్రిష్ణా రెడ్డే పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పాటు అధికార పార్టీ నేతలు ఎవరు జగన్ ను విమర్శించినా కూడా జగన్ తరపున సజ్జలే రంగంలోకి దిగి కౌంటర్ లు ఇస్తారు అనే విషయం తెలిసిందే. ఇటీవల విజయవాడ లో జరిగిన ఒక సమావేశంలో పాల్గొన్న సజ్జల రామకృష్ణా రెడ్డి వచ్చే ఎన్నికల్లో జగన్ తిరిగి అధికారంలోకి వస్తే అమరావతి నుంచే పాలనా సాగిస్తారు అని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇది ఇప్పుడు రాజకీయంగా ఆ పార్టీ డబుల్ ట్రబుల్ లో పడేసింది అనే చర్చ వైసీపీ నేతల్లో సాగుతోంది. సజ్జల ప్రకటన కారణంగా వైసీపీ కి అటు ఉత్తరాంధ్ర తో పాటు ఇటు అమరావతి పరిధిలో ఉండే జిల్లాల్లో కూడా నష్టం తప్పదు అనే భయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. అధికారంలో ఉన్నంత కాలంగా మూడు రాజధానుల నినాదం అందుకుని...వైజాగ్ ను పరిపాలనా రాజధానిగా చేస్తే వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని చెప్పుకుంటూ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు సడన్ గా ఎవరూ ఊహించని రీతిలో జగన్ మళ్ళీ గెలిస్తే అమరావతి నుంచి పాలన సాగిస్తారు అని చెప్పి....ఇప్పుడు ఉన్న భవనాలే సరిపోతాయి ...అమరావతి పై అంత ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పుకొచ్చారు. ఏదైనా ఉంటే విజయవాడ -గుంటూరు ప్రాంతాల మధ్య కొన్ని నిర్మాణాలు చేసుకుంటే సరిపోతుంది అన్నారు.

కానీ మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన రాజధాని అమరావతి మోడల్ వేరు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కారణాలు ఏమైనా టీడీపీ రైతుల దగ్గర నుంచి భూములు సమీకరించి అక్కడ ఐకానిక్ టవర్స్ తో పాటు పలు కొత్త భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అయితే సజ్జల మాత్రం జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చినా కూడా పాలన ఇక్కడ నుంచి సాగిస్తారు అని చెప్పారు కానీ...ఇక్కడ కొత్త నిర్మాణాలకు తాము అనుకూలం కాదు అని చెప్పటం ద్వారా ఇటు అమరావతి ప్రాంతంతో పాటు అటు ఉత్తరాంధ్ర లో కూడా రాజకీయంగా నష్టపోయే పరిస్థితి తలెత్తింది అని వైసీపీ నేతల్లో చర్చ సాగుతోంది. అధికార టీడీపీ తో పాటు కూటమి నేతలు కచ్చితంగా ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవటం ఖాయం అనే భయం ఈ రెండు ప్రాంతాల వైసీపీ నేతల్లో వ్యక్తం అవుతోంది. పార్టీలు , పార్టీ అధినేతలు మాటలు మార్చటం కొత్తేమి కాకపోయినా అత్యంత సున్నితమైన రాష్ట్ర రాజధాని విషయంలో పదే పదే మాట మార్చటం వల్ల ఇప్పుడు రెండు ప్రాంతాల్లో కూడా రాజకీయం ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోకతప్పదు అనే భయం ఆ పార్టీ నేతలను వెంటాడుతుంది. సజ్జల రామకృష్ణరెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టాయనే అభిప్రాయం ఎక్కువ మంది వైసీపీ నేతల్లో ఉంది.

Next Story
Share it