Telugu Gateway
Andhra Pradesh

అలా మాట్లాడితే ఇలాగే ఉంటది

అలా మాట్లాడితే ఇలాగే ఉంటది
X

టీడీపీ నేత‌లు భ‌విష్య‌త్ లో కూడా ఇలాగే మాట్లాడితే అలానే ఉంటుంద‌ని వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. ఇంత కాలం చాలా సంయ‌మ‌నం పాటించామ‌ని..ఇక అలా ఉండ‌ద‌న్నారు. ప్ర‌భుత్వంపై కుట్ర‌తోనే..అంతా ప‌థ‌కం ప్ర‌కారం ప్లాన్ చేసి విమ‌ర్శ‌లు చేయించార‌న్నారు. టీడీపీ పార్టీ అన్ని హద్దులనూ దాటేసిందని విమ‌ర్శించారు. టీడీపీ నేతల భాష రోజురోజుకీ దిగజారిపోతుందన్నారు. ఒక అధికార ప్రతినిధిగా ఉన్న పట్టాభి రాష్ట్రంలో కోట్లాదిమంది అభిమానించే సీఎం జగన్‌ను దుర్భాషలాడారని, మాట్లాడింది పట్టాభి అయితే.. మాట్లాడించింది చంద్రబాబు అని పేర్కొన్నారు. చంద్రబాబుతో చర్చించి, కేంద్ర కార్యాలయంలో కూర్చుని పట్టాభి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారన్నారు. ఇలాంటి మాట పలుమార్లు అనడం వెనుక ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించారు. ఇంత ఘోరమైన మాట్లాడిన తర్వాత ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావాలని, పట్టాభి అనుచిత వ్యాఖ్యలపైనే.. నిన్నటి రియాక్షన్‌ వచ్చిందన్నారు.

చంద్ర‌బాబు చాలా దేవాల‌యం లాంటి కార్యాల‌యం అంటున్నార‌ని..మ‌రి దేవాల‌యంలో కూర్చుని బూతులు మాట్లాడిస్తారా? అని ప్ర‌శ్నించారు. పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేయకపోతే రియాక్షన్‌ ఉండేది కాదని అన్నారు. ఇక ముందు కూడా అర్థం పర్థం లేకుండా ఇలానే తిడితే తప్పకుండా రియాక్షన్ ఉంటుందని అన్నారు. గత రెండున్నరేళ్లుగా వైఎస్‌ జగన్‌ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రజల్లో మంచిపేరు వచ్చిందని, అది తట్టుకోలేక ప్రజల్లోకి అబద్ధపు ప్రచారాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల ఆగ్రహానికి బాధ్యత వహించాల్సింది చంద్రబాబేనని స్పష్టం చేశారు. పట్టాభి వాడిన భాష తాము కూడా మాట్లాడితే ఎలా ఉంటుందని, ప్రజాస్వామ్య స్పూర్తి అంటే బండ బూతులు తిట్టడమా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఎంత రెచ్చగొట్టినా తాము సంయమనం పాటిస్తున్నామన్నారు.

Next Story
Share it