సజ్జల కీలక వ్యాఖ్యలు
ప్రభుత్వ ఉద్యోగుల తీరుపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వ ఉద్యోగులకు..సర్కారుకు మధ్య పీఆర్సీ అంశంపై వివాదం సాగుతోంది. పీఆర్సీ వల్ల జీతాలు పెరక్కపోగా తగ్గాయనే ఉద్యోగ సంఘాలు వాదిస్తుంటే..సర్కారు మాత్రం ప్రభుత్వంపై పది వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతోందని చెబుతోంది.గతంలో ఎన్నడూలేని రీతిలో ఉద్యోగ సంఘాలు అన్నీ ఒక్కటై ఉమ్మడి కార్యాచరణకు పూనుకున్నాయి. వచ్చే నెల ఆరు నుంచి సమ్మెకు వెళ్ళేందుకు నిర్ణయించుకుని..సోమవారం నాడు సీఎస్ కు సమ్మె నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఈ మధ్యలోనే ఉద్యోగులతో చర్చించేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీ ఉద్యోగ సంఘ నేతలను చర్చలకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. అసలు ఈ కమిటీకి ఉన్న పరిధి ఏమిటి?. దీనికి సంబంధించిన విధివిధానాల ఏమిటో తెలియకుండా తాము ఆ కమిటీతో ఏమి చర్చిస్తామని..పీఆర్సీ జీవోలు రద్దు చేస్తేనే చర్చలకు వెళతామంటూ ఉద్యోగ సంఘ నేతలు తేల్చిచెప్పారు.
ప్రభుత్వ కమిటీ సోమవారం నాడు ఉద్యోగులు చర్చలకు వస్తారేమో అని వేచిచూసి..వారు రాకపోవటంతో మీడియా ముందుకు వచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని గుర్తించబోమని ఉద్యోగ సంఘాలు చెప్పడం ప్రతిష్టంభన పెంచడమే అవుతుందని సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి వ్యాఖ్యానించారు. అపోహలు ఉంటే కమిటీతో మాట్లాడి నివృత్తి చేసుకోవాలన్నారు. రేపు కూడా చర్చలకు రమ్మని పిలుస్తామన్నారు. ఉద్యోగుల అంశంపై కమిటీ మధ్యవర్తిత్వం వహిస్తుందని, తాము ఎప్పుడూ చర్చలకు సిద్ధంగానే ఉన్నామన్నారు. ఉద్యోగులను చర్చలకు పిలించామని, అయితే వారు చర్చలకు రాలేదన్నారు. ఉద్యోగులు ఎప్పుడూ ప్రభుత్వంలో భాగమే అన్నది తమ అభిప్రాయం అన్నారు. ఇదే అంశంపై హైకోర్టులో విచారణ సాగింది. అయితే దీనిపై ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఈ పిటీషన్ ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కు బదిలీ చేశారు.