సజ్జలకు ఏపీలో ఓఎస్డీనే దొరకలేదా?!
ఆంధ్రప్రదేశ్ సర్కారు గురువారం నాడు ఓ జీవో జారీ చేసింది. కానీ ఇందులో ఎన్నో వింతలు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యవహరాల సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డికి అసలు ఏపీలో ఓఎస్డీగా పెట్టుకునే అర్హత ఉన్న మనిషే దొరకలేదా అన్న అనుమానం రావటం ఖాయం ఈ జీవో చూస్తే. అంతే కాదు ఇక్కడ మరో కీలకమైన ట్విస్ట్ కూడా ఉంది. అదేమిటంటే తెలంగాణలో జైళ్ల సూపరిండెంట్ గా ఉన్న డాక్టర్ దశరథరామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ లోని ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి దగ్గరే డెప్యుటేషన్ పై ఓఎస్టీడీగా పనిచేయాలని ఉందని ఓ దరఖాస్తు చేసుకున్నారు. సహజంగా మంత్రి అయినా..క్యాబినెట్ ర్యాంక్ అధికారి అయినా తన దగ్గర పనిచేసే సిబ్బందిని ఎంపిక చేసుకుని వారిని కేటాయించాల్సిందిగా సంబంధిత అధికారులకు లేఖ రాస్తారు. అవి పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం అంతరాష్ట్ర డిప్యుటేషన్ కోరుకునే వ్యక్తే ..ఎవరి దగ్గర.. ఏమి పోస్టు కావాలో కోరుకోవటం..అందుకే ప్రభుత్వం ఓకే అనటం చాలా విచిత్రం అని ఓ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు.
దశరధరామిరెడ్డి వినతి ఆధారంగా ఏపీ సర్కారు తెలంగాణ సర్కారుకు ఆయన సమ్మితి వివరాలను తెలుపుతూ లేఖ రాసింది. ఈ వినతిని తెలంగాణ సర్కారు కూడా సమ్మితించి రెండేళ్ల పాటు దశరధరామిరెడ్డి డిప్యుటేషన్ కు అనుమతి ఇచ్చింది. తెలంగాణ సర్కారు సమ్మతి రావటంతో ఏపీ సర్కారు గురువారం నాడు దశరథరామిరెడ్డిని ప్రజా వ్యవహరాల సలహాదారు ఓఎస్డీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తదుపరి ఆదేశాలు వెలువడే వరకూ ఆయన ఈ పదవిలో ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే సమయంలో దశరథరామిరెడ్డిని సత్వరమే తెలంగాణలో విదుల నుంచి రిలీవ్ చేసి..ఆయన సర్వీసు రికార్డులను ఏపీ జీఏడీ పొలిటికల్ విభాగంలో అప్పగించాలని జీఏడీ పొలిటికల్ ముఖ్య కార్యదర్శి ముత్యాలరాజు జారీ చేసిన జీవో 1186లో పేర్కొన్నారు.