ప్రత్యేక హోదా..బలం ఉన్నా ఉపయోగించలేకపోతున్నాం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబందించి వస్తున్న రాజకీయ విమర్శలపై వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ట్రారెడ్డి కౌంటర్ ఇచ్చారు. కొన్ని పార్టీలు..కొన్ని మీడియా సంస్థలు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంలో తమపై ఆధారపడే ప్రభుత్వం వస్తే ,,తమకు సరిపడా బలం ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామని జగన్ గతంలో ప్రకటించారన్నారు. అయితే తమకు బలం ఉన్నా కూడా ఉపయోగించలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. అయినా చంద్రబాబు తాకట్టుపెట్టిన ప్రత్యేక హోదా అంశాన్ని సీఎం జగన్ తన ప్రతి పర్యటనలోనూ ప్రస్తావిస్తూనే ఉన్నారని..తాము ఈ అంశాన్ని ఏమీ వదిలిపెట్టలేదన్నారు. యనమల రామక్రిష్ణుడు లాంటి సీనియర్ నేత కూడా సీఎం జగన్ ఢిల్లీ టూర్ కేసుల నుంచి కాపాడుకునేందుకే అని వ్యాఖ్యానించటాన్ని ఆయన తప్పుపట్టారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు యనమల చదువుతున్నారని ఎద్దేవా చేశారు. ఇదే నిజం అయితే ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా మరి కేసులు ఎందుకు కొట్టేయటంలేదని ప్రశ్నించారు. ఇది అంతా న్యాయపక్రియలో సాగుతుందని..జగన్ పై కాంగ్రెస్, టీడీపీలు కలసి ఎలా కేసులు పెట్టాయో అందరికీ తెలిసిందే అన్నారు. ప్రజా న్యాయస్థానంలో వీరి ఆరోపణలు తప్పు అని ఎన్నోసార్లు నిరూపితం అయిందని సజ్జల వ్యాఖ్యానించారు. బిజెపితో తమకు ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవని..సీఎం జగన్ పర్యటన కేవలం రాష్ట్ర ప్రభుత్వ అవసరాల కోణంలోనే సాగిందని అన్నారు.
ఆరు నెలల తర్వాత సీఎం జగన్ ఢిళ్లీ వెళ్లారని..పోలవరం ప్రాజెక్టు అంచనాల ఆమోదంతోపాటు రాష్ట్ర సమగ్రాభివద్ధికి ఉద్దేశించిన మూడు రాజధానులు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇలా ఎన్నో అంశాలను కేంద్ర మంత్రుల వద్ద ప్రస్తావించిన విషయాన్ని సజ్జల గుర్తు చేశారు. పోలవరంలో అసలైన పనులు ఇప్పుడే జరుగుతున్నాయని సజ్జల వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ఢిల్లీలో ఐదుగురు కేంద్రమంత్రులనుకలిశారని, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను ప్రస్తావించారని చెప్పారు. '' గతంలో ఢిల్లీ పర్యటనల్లో చంద్రబాబు చీకటి ఒప్పందాలు చేసుకునేవారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే నాడు చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు జరిగాయి. హోంమంత్రి అపాయింట్‌మెంట్ వాయిదా పడితే అది తప్పా?. రాష్ట్ర ప్రయోజనాలకే సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు. కరోనా సమయంలో కూడా పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు పోలవరం పనులు ఒక యజ్ఞంలా సాగుతున్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణ జరగడం ఖాయం అన్నారు.