Telugu Gateway
Andhra Pradesh

తడిసిమోపెడు అవుతున్న నిర్వహణ ఖర్చు

తడిసిమోపెడు అవుతున్న నిర్వహణ ఖర్చు
X

ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. కూటమి ప్రభుత్వం కొలువు తీరి మూడు నెలలు దాటుతున్నా కూడా ఇంతవరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటం విమర్శలకు తావు ఇస్తోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న ఆసక్తి కూడా అధికార వర్గాల్లో కూడా ఉంది. వందల కోట్ల రూపాయలు వెచ్చించి కట్టిన ఈ భవనాలను ప్రభుత్వ అవసరాలకు ఉపయోగిస్తారా...లేక ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తారా అన్న చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. ఇప్పటికే దీనిపై ప్రభుత్వ డబ్బును కోట్ల రూపాయల మేర ఖర్చు చేయగా...ఎలాంటి అవసరాలకు వాడకుండా కూడా ఇప్పుడు దీనిపై ప్రతినెలా లక్షల రూపాయల వ్యయం చేయాల్సి వస్తోంది అని చెపుతున్నారు.

నిర్వహణ భారంతో పాటు విద్యుత్ బిల్లులు కూడా తడిసిమోపెడు అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం అత్యంత విలాసవంతమైన రుషికొండ ప్యాలస్ పై తుది నిర్ణయం తీసుకోవటానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు సంయుక్తంగా దీన్ని సందర్శించిన తర్వాతే దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది అని అధికార వర్గాలు చెపుతున్నాయి. నిర్ణయం ఏదైనా కూడా త్వరితగతిన తీసుకుంటేనే విమర్శలకు చెక్ పెట్టవచ్చు అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఒక వైపు ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక కష్టాల్లో ఉంది చెపుతూ ఇంత ప్రైమ్ ప్రాపర్టీ ని అలా నిరుపయోగంగా ఉంచటం సరికాదు అనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తామనే ధీమాతో వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైజాగ్ లోని రుషికొండపై సెవెన్ స్టార్ సౌకర్యాలు ఉండేలా అద్భుత ప్యాలస్ కట్టించిన సంగతి తెలిసిందే. అది కూడా ప్రజల డబ్బుతోనే.

వైజాగ్ ను పరిపాలనా రాజధానిగా ప్రకటించటంతో ప్రజలంతా తమ వైపే ఉంటారు అనుకున్న జగన్ లెక్కలన్నీ తారుమారు అయ్యాయి. పర్యాటకుల కోసం కట్టిన భవనాలు కూల్చి మరీ ఎంతో ముచ్చటపడి కట్టుకున్న ప్యాలస్ లోకి అడుగుపెట్టకుండానే జగన్ పదవి నుంచి దిగిపోయిన విషయం తెలిసిందే. తొలుత ఈ భవనాన్ని కడుతున్న సమయంలో పర్యాటక అవసరాల కోసమే అని ప్రకటించిన అప్పటి వైసీపీ సర్కారు...అవి తుది రూపు తీసుకునే సమయానికి ఇవి సీఎం క్యాంపు ఆఫీస్ కం రెసిడెన్స్ కు అనూకూలంగా ఉంటాయని నివేదిక సిద్ధం చేయించుకున్న విషయం తెలిసిందే.

Next Story
Share it