Telugu Gateway
Andhra Pradesh

ఆర్జీవీ..జగన్ ల పొలిటికల్ బిజినెస్ డీల్ ?!

ఆర్జీవీ..జగన్ ల పొలిటికల్ బిజినెస్ డీల్ ?!
X

రాంగోపాల్ వర్మ ఏమి చేసినా ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి చెపుతారు. తన విషయాలే కాదు..ఇతరుల విషయాలు కూడా ఆయనే చెపుతారు. అందుకు తాజా ఉదాహరణ పూరి జగన్నాథ్, లైగర్ సినిమా బయ్యర్లతో తలెత్తిన వివాదం పై కూడా వర్మ స్పందించి పోస్టులు పెట్టారు. కానీ అయన బుధవారం నాడు అమరావతిలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో సమావేశం అయ్యారు. ఇది కీలక భేటీ. కానీ అయన ఈ విషయం పై ఎలాంటి ట్వీట్ చేయలేదు. ప్రభుత్వం నుంచి కూడా దీనిపై ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ఇది కచ్చితంగా పొలిటికల్ బిజినెస్ డీల్ అని వైసీపీ వర్గాల్లో కూడా ప్రచారం జరుగుతోంది. సహజంగా బిజినెస్ డీల్స్ అయితేనే అది ఇచ్చిన వాళ్ళ షరతులు పాటించాల్సి ఉంటుంది. లేక పోతే ఏదైనా మాట్లాడవచ్చు. ఇది 100 శాతం పొలిటికల్ బిజినెస్ డీల్ కాబట్టే వర్మ తన సహజ శైలికి భిన్నంగా ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం విషయాలు బయటకు చెప్పలేదని వైసీపీ వర్గాలు చెపుతున్నాయి. కారణాలు ఏమైనా వర్మకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటే పెద్దగా పడదు. అటు ట్వీట్ల ద్వారా..సినిమాల ద్వారా కూడా వీళ్ళను దెబ్బ కొట్టాలని చూస్తారు. అది ఏమేరకు ప్రభావం చూపిస్తుంది అనే అంశాన్ని పక్కన పెట్టి మరి అయన తన ప్రయత్నం అయితే తాను చేస్తారు. చాలా సార్లు వర్మ చేసిన రాజకీయ సినిమా ప్రయోగాలు ఫెయిల్ అయ్యాయనే చెప్పాలి.

2024 లో జరిగే ఎన్నికల్లో అటు టీడీపీ, ఇటు జనసేన లు కలిసే ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఇది అధికార వైసీపీకి ఖచ్చితంగా నష్టం చేసే పరిణామమే. ఈ నష్ట నివారణకు వైసిపీ తన ప్రయత్నాలు తాను చేస్తుంది. అటు చంద్రబాబు, ఇటు పవన్ పై రాజకీయ విమర్శలతో ఎటాక్ చేస్తూ వస్తోంది. ఇప్పుడు రాంగోపాల్ వర్మ ను ఉపయోగించుకొని వీరిద్దరిని టార్గెట్ చేస్తూ సినిమాలు నిర్మించటానికే సీఎం జగన్ వర్మ తో సమావేశం అయ్యారని ఆ పార్టీ నేతల్లో కూడా చర్చ నడుస్తోంది. ఎన్నికల నాటికీ ...కొంత ముందే ఈ ఒప్పందంలో భాగంగా కొన్ని సినిమాలు వస్తాయని చెపుతున్నారు. వర్మ తీయబోయే కొత్త సినిమా లే ఈ భేటీ ప్రభావాన్ని అంచనా వేయటానికి ఉపయోగ పడతాయని సమాచారం. గత కొంత కాలంగా వర్మ తీసిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద ఫట్ అంటున్నాయి. మరి ఈ రాజకీయ కొత్త సినిమాలు ఎలా ఉంటాయే వేచిచూడాల్సిందే. రాజకీయ సినిమాల అంశం కాకపోతే జగన్ వర్మ తో సమావేశం కావాల్సిన పని ఏమి ఉంటది అని ఒక నేత వ్యాఖ్యానించారు.

Next Story
Share it