రిలయన్స్ ఛానల్ ఎడిటర్ ట్వీట్..టార్గెట్ జగన్
జగన్ కు మమతా బెనర్జీ ఆహ్వానం..సమావేశానికి జగన్ దూరం
పల్లవి ఘోష్. సీఎన్ఎన్ న్యూస్ 18 ఛానల్ సీనియర్ ఎడిటర్. ఇది దేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధీనంలో ఉంది. ఈ ఛానల్ ఎడిటర్ పల్లవి ఘోష్ బుధవారం నాడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ఇది ఇప్పుడు వాట్సప్ లో విపరీతంగా సర్కులేట్ అవుతోంది. సహజంగానే దీన్ని టీడీపీ భారీగానే వాడుకుంటోంది. ఈ వ్యవహారంపై ఇప్పుడు వైసీపీ క్యాంపు ఎలా స్పందిస్తుంది అన్నది వేచిచూడాల్సిందే. పల్లవి ఘోష్ బుధవారం సాయంత్రం ఓ ట్వీట్ చేశారు. దీనికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖను జత చేశారు. దానిపైన ఢిల్లీలో తలపెట్టిన సమావేశానికి ఆహ్వానిస్తూ జగన్ కు మమతా బెనర్జీ లేఖ రాశారని..అయితే సీబీఐ కేసుల భయంతో ఆయన ఈ సమావేశానికి హాజరు కావటానికి తిరస్కరించారంటూ తనకు సమాచారం అందిందని పేర్కొన్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రపతి ఎన్నికల అంశంపై చర్చించేందుకు మమతా బెనర్జీ బుధవారం నాడు ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
కేంద్రంలోని మోడీ సర్కారు రాష్ట్రాల విషయంలో దారుణంగా వ్యవహరిస్తోందని..గిట్టని ప్రభుత్వాలు..నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నందున అందరం కలసి రాష్ట్రపతి ఎన్నికలను ఉపయోగించుకుని కేంద్రానికి తగిన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం చర్యల వల్ల విదేశాల్లో కూడా దేశం పరువుపోతోందని మమతా బెనర్జీ తన లేఖలో ప్రస్తావించారు. దేశంలో ప్రజాస్వామ్యం ఇప్పుడు తీవ్ర ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీల గొంతు బలంగా విన్పించాల్సిన అవసరం ఉందన్నారు. టీఆర్ఎస్ తోపాటు ఆప్, బిజెడిలు కూడా మమతా బెనర్జీ బుధవారం నాడు ఢిల్లీలో నిర్వహించిన సమావేశానికి దూరంగా ఉన్నాయి. ఈ ట్వీట్ పై దుమారం రేగటంతో ఆమె ఇందులో చిన్న సవరణ చేశారు. టీఎంసీ వర్గాలు చెప్పిన సమాచారం ఇది అంటూ చెబుతూనే..వైసీపీ దీన్ని ఖండించిందని తెలిపారు. కాంగ్రెస్ తో కలసి తాము ఎక్కడా పాల్గొనబోమని చెప్పినట్లు కొత్తగా చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు.