Telugu Gateway
Andhra Pradesh

ఉద్యోగాల ఛాన్స్ వెయ్యి మాత్రమే

ఉద్యోగాల ఛాన్స్  వెయ్యి మాత్రమే
X

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆంధ్ర ప్రదేశ్ లో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది అని ప్రభుత్వం గత కొన్ని రోజులుగా చెపుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లక్ష కోట్ల రూపాయలపైన పెట్టుబడి పెడుతున్నా కూడా ఈ సంస్థ ద్వారా వచ్చే ఉద్యోగాల సంఖ్య కేవలం వెయ్యి మాత్రమే. అది కూడా పక్కాగా వస్తాయని లేదు. వెయ్యి మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అని మాత్రమే చెపుతున్నారు. మరో కీలక విషయం ఏమిటి అంటే ఈ ప్రాజెక్ట్ ప్రభుత్వం మొత్తం కలుపుకుని దగ్గర దగ్గర 19000 కోట్ల రూపాయల రాయితీలు కల్పించబోతోంది. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ ఐటి శాఖ బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రిలయన్స్ డేటా సెంటర్ కోసం ప్రభుత్వం విజయనగరం జిల్లా పోలిపల్లి గ్రామంలో లో 855 ఎకరాలు కేటాయించనుంది. ఈ గిగా స్కేల్ ఎఇ డేటా సెంటర్ (ఏఐడీసి) తో పాటు కేబుల్ లాండింగ్ స్టేషన్ (సిఎల్ఎస్) పై కంపెనీ మొత్తం 1 ,08,010 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుంది ఆంధ్ర ప్రదేశ్ ఐటి శాఖ బుధవారం నాడు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

లక్ష కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టినా ఈ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే ఉద్యోగాలు మాత్రం కేవలం వెయ్యి మాత్రమే. ఇదే విషయాన్నీ జీవో లో కూడా ప్రస్తావించారు. అయినా సరే ఈ డేటా సెంటర్ ప్రాజెక్ట్ కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం భారీ ఎత్తున రాయితీలు ఇవ్వటానికి సిద్ధం అయింది. ఈవోడీబీ నిబంధనల ప్రకారం ఈ ప్రాజెక్ట్ కు సింగిల్ విండో క్లియరెన్స్ సౌకర్యం కల్పించనున్నారు. ఇతర డేటా సెంటర్ ప్రాజెక్టుల తరహాలోనే ఈ ప్రాజెక్ట్ అమలును స్టీరింగ్ కమిటీ పర్యవేక్షిస్తుంది అని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. నీటి సరఫరా హామీ, డీసాలినేషన్ ప్లాంట్‌లో సంయుక్త యాజమాన్యం మోడల్ ను ప్రతిపాదించారు. ప్రభుత్వం జలవనరుల శాఖ, మున్సిపల్ శాఖ, ఏపీఐఐసి ద్వారా ప్రతిపాదిత ప్రాంతాలకు 20 సంవత్సరాలపాటు హామీతో నీటి సరఫరా కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన ఖర్చును సంస్థే భరిస్తుంది. డీసాలినేషన్ ప్లాంట్‌లో సంయుక్త యాజమాన్యంపై ఏపీఐఐసి సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి సాధ్యమైన ప్రతిపాదన సమర్పించాల్సిందిగా ఆదేశించారు. రిలయన్స్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ కు పెద్ద ఎత్తున ఆర్థిక ప్రోత్సాహకాలు కల్పించనున్నారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ కు డేటా సెంటర్ కు అవసరం అయిన భూమిని 25% రాయితీ ధరకు కేటాయించనున్నారు. ఈ డేటా సెంటర్ ప్రాజెక్ట్ కోసం మొత్తం 853.97 ఎకరాల భూమిని సిఫారసు చేశారు. ఈ భూములను ఏపీఐఐసి కి బదిలీ చేసి, అనంతరం కంపెనీకి కేటాయించేందుకు రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీఐఐసీ భూసేకరణ ప్రక్రియ ప్రారంభించినప్పుడు కంపెనీ భూమి విలువలో 75 శాతం చెల్లించాలి అని పేర్కొన్నారు. కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కోసం ఒక ఎకరం భూమిని సిఫారసు చేశారు. తగిన భూభాగాన్ని గుర్తించి కంపెనీకి కేటాయించేందుకు ఏపీఐఐసి, జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు.స్టాంప్ డ్యూటీ , రిజిస్ట్రేషన్ చార్జీలపై 100% మినహాయింపు కల్పించబడుతుంది. అదే సమయంలో యంత్రాలు, పరికరాలపై పెట్టుబడిలో 6% మేర మూలధన సబ్సిడీని 10 సమాన వాయిదాల్లో చెల్లిస్తారు.

గరిష్ట పరిమితి రూ.4,500 కోట్లు. నిర్మాణంపై ఎస్ జీఎస్ టి మినహాయింపు కూడా ఇస్తారు. రాష్ట్రానికి వచ్చే నికర ఎస్ జీఎస్ టి మొత్తంపై 100% రీయింబర్స్‌మెంట్ ఇస్తారు. మొత్తం ప్రోత్సాహకం రూ.2,527.38 కోట్లకు పరిమితం. ఇది 10 సంవత్సరాలపాటు లేదా ప్రాజెక్ట్ గరిష్ట సామర్థ్యానికి చేరుకునే వరకు వర్తిస్తుంది. లీజింగ్ ఖర్చులపై కూడా ఎస్ జీఎస్ టి రీయింబర్స్‌మెంట్ సౌకర్యం కలిపించనున్నారు. 10 సంవత్సరాలపాటు రాష్ట్రానికి వచ్చే నికర ఎస్ జీఎస్ టి మొత్తంపై 100 శాతం రీయింబర్స్‌మెంట్ ఇస్తారు. ఈ మొత్తం ప్రోత్సాహకం రూ.1,800 కోట్లకు పరిమితం. నీటి టారిఫ్‌పై 10 సంవత్సరాలపాటు 15% సబ్సిడీ ఇస్తారు. మొత్తం ప్రోత్సాహకం రూ.552.41 కోట్లకు పరిమితం చేశారు. ఆప్టికల్ గ్రౌండ్ వైర్ ఫైబర్ యాక్సెస్ రాయితీ కూడా ఉంది. ఈ

OPGW ఫైబర్ యాక్సెస్‌పై 20 సంవత్సరాలపాటు 30% రాయితీ ఇస్తారు. నిర్వహణ ఖర్చులు ప్రతి మూడు సంవత్సరాలకు 5% చొప్పున పెరుగుతాయి. మొత్తం ప్రోత్సాహకం రూ.1,220.71 కోట్ల రూపాయల గరిష్ట పరిమితి విధించారు. రైట్ ఆఫ్ వే (RoW) ఫీజు మినహాయింపు కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన రైట్ ఆఫ్ వే ఖర్చులను 20 సంవత్సరాలపాటు మినహాయిస్తారు. మొత్తం ప్రోత్సాహకం రూ.200 కోట్ల రూపాయలు. విద్యుత్ టారిఫ్ సబ్సిడీ విషయానికి వస్తే 15 సంవత్సరాలపాటు యూనిట్‌కు రూ.1 తగ్గింపుతో విద్యుత్ సరఫరా చేస్తారు. గరిష్ట పరిమితి రూ.3,114.18 కోట్లు. క్రాస్ సబ్సిడీ సర్‌చార్జ్ మినహాయింపు కల్పిస్తారు. క్యాప్టివ్ సోలార్ పార్క్‌కు 20 సంవత్సరాలపాటు క్రాస్ సబ్సిడీ సర్‌చార్జ్ విధించరు. ఇది ఇంధన శాఖ నిబంధనల ప్రకారం అమలు అవుతుంది. ట్రాన్స్‌మిషన్ / వీలింగ్ చార్జీల మినహాయింపు కూడా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (ఇంధన శాఖ) విధించే ట్రాన్స్‌మిషన్ చార్జీలపై 20 సంవత్సరాలపాటు 100% మినహాయింపు ఇస్తారు. గరిష్ట పరిమితి రూ.5,000 కోట్లు. 15 సంవత్సరాలపాటు విద్యుత్ డ్యూటీపై 100% మినహాయింపు ఇస్తారు. గరిష్ట పరిమితి రూ.186.85 కోట్లు గా నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్ కు అవసరం అయిన భూమిపై ఇచ్చే 25 శాతం డిస్కౌంట్ ను కూడా కలుపుకుంటే రాయితీల మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది అని అధికారులు చెపుతున్నారు.

Next Story
Share it