Telugu Gateway
Andhra Pradesh

నో ఛాన్స్ అంటున్న టీడీపీ అధిష్ఠానం!

నో ఛాన్స్ అంటున్న టీడీపీ అధిష్ఠానం!
X

రాజ్య సభ ఎన్నికలకు ముహూర్తం దగ్గరకు వస్తుండటంతో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ముమ్మరం చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన నలుగురు సభ్యుల పదవి కాలం జూన్ 21 న ముగియనుంది. ప్రస్తుతం ఇందులో మూడు సీట్లు వైసీపీవి అయితే...ఒక సీటు తెలుగు దేశం పార్టీ ది. వచ్చే ఎన్నికల్లో ఈ నాలుగు సీట్లు కూడా కూటమికే దక్కనున్నాయి. పదవి విరమణ చేయనున్న వాళ్లలో వైసీపీ కి చెందిన ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, సానా సతీష్ లు ఉన్నారు. ఈ నాలుగు సీట్లలో ఒకటి ఒప్పందంలో భాగంగా జనసేన కు వెళ్ళటం ఖాయంగా చెపుతున్నారు. ఈ సీటు పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడిగా పేరున్న లింగమనేని రమేష్ కు కేటాయించటం ఖాయం అని ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. మరి మిగిలిన మూడు సీట్లను ఈ సారి టీడీపీ నే ఉంచుకుంటుందా...ఇందులో కూడా బీజేపీ వాటా అడుగుతుందా లేదా అన్న అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

అయితే ఈ సారి మాత్రం బీజేపీ కి రాజ్యసభ సీటు కేటాయించే ఆలోచనలో లేరు...తర్వాత అవకాశం ఇద్దాం అని చంద్రబాబు నాయుడు యోచిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల ఒక కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదేంటి అంటే పదవి విరమణ చేసిన ఒక న్యాయమూర్తికి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా రాజ్య సభ సీట్ ఇప్పించేందుకు దేశంలోని దిగ్గజ పారిశ్రామిక సంస్థల్లో ఒకటి నేరుగా రంగంలోకి దిగినట్లు చెపుతున్నారు. ఆ సంస్థకు చెందిన కీలక ప్రతినిధి ఒకరు నేరుగా ఇదే అంశాన్ని టీడీపీ పెద్దల వద్ద ప్రస్తావించగా...రిటైర్డ్ జడ్జి కు కాదు..మీకు అయితే ఇస్తాను అని చెప్పటంతో అవాక్కు అవటం అయన వంతు అయింది అని ఒక మంత్రి వెల్లడించారు.

ఎవరు చెప్పినా కూడా పార్టీ అధిష్ఠానం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ రిటైర్డ్ జడ్జి కి రాజ్య సభ ఇవ్వటానికి ఏ మాత్రం సుముఖంగా లేదు అని...పార్టీ కి చెందిన సీనియర్ నేతలు ఎంతో మంది ఇప్పడు రాజ్య సభ సీట్ కోసం రేస్ లో ఉన్న తరుణంలో అది ఏ మాత్రం సాధ్యం కాదు అని తేల్చి చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జూన్ లో ఖాళీ కానున్న సీట్లలో ఒక సీటు జనసేన కు వెళితే..మరో సీటు సానా సతీష్ కు పక్కాగా కేటాయిస్తారు అని చెపుతున్నారు. ఆయనకు పూర్తి టర్మ్ దక్కనందున మరో ఛాన్స్ దక్కటం ఖాయం అన్నది ఎక్కువ మంది చెపుతున్న మాట. టీడీపీలో ప్రస్తుతం తెర వెనక ఉండి హవా చెలాయిస్తున్నారు అని పార్టీ లో ప్రచారం జరుగుతున్న మంత్రి నారా లోకేష్ సన్నిహితుడు కిలారి రాజేష్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నా కూడా సానా సతీష్ కు రెన్యువల్ చేస్తున్నందున ఒక్క సారే ఇద్దరు లోకేష్ సన్నిహితులకు సీటు ఇవ్వటం సాధ్యం కాకపోవచ్చు అంటున్నారు.

కూటమి టర్మ్ ముగిసేలోపు వచ్చే ఎన్నికల్లో అంటే 2028 లో కిలారి రాజేష్ కు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. బీజేపీ ఈ సారి ఏపీ నుంచి రాజ్య సభ సీటు అడగపోతే టీడీపీ కి కొంత రిలీఫ్ దక్కటం ఖాయం. ఎందుకంటే గతంలో రాజ్య సభ హామీ ఇచ్చిన వాళ్ళు..ఆశావహుల సంఖ్య భారీ ఎత్తున ఉంది. అయితే ఇందులో సామాజిక సమీకరణ లెక్కలు కూడా ఉంటాయి. అధిష్టానం సీరియస్ గా పరిశీలిస్తున్న వాళ్లలో భాష్యం రామకృష్ణ, గల్లా జయదేవ్ ల పేర్లు ఉన్నాయి. వీళ్ళిద్దరిలో ఒకరికి సీటు పక్కా అని... మరో సీటును రాయలసీమ ప్రాంతానికి చెందిన బీసీ కి కేటాయించే అవకాశం ఉంది అని చెపుతున్నారు. అయితే అది మహిళకు దక్కటానికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Next Story
Share it