Telugu Gateway
Andhra Pradesh

రజని ఘాటు డైలాగులు ఎవరిపై!

రజని ఘాటు డైలాగులు ఎవరిపై!
X

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో చిరంజీవి వివాదం కొనసాగుతుండగానే ..ఇప్పుడు రజనీకాంత్ డైలాగుల రచ్చ స్టార్ట్ అయింది. ఆయన హీరో గా నటించిన జైలర్ సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించి తాజాగా తమిళనాడులో ఒక కార్యక్రమం నిర్వహించారు. అందులో రజనీకాంత్ సినిమా స్టైల్ లో చెప్పిన డైలాగుల వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ‘కుక్క మొరగకుండా ఉండదు. నోరు విమర్శించకుండా ఉండదు. ఇవి రెండూ ఉండని ఊరే ఉండదు. మనం మాత్రం మన పని చూసుకుంటూ పోతూనే ఉండాలి ’ అంటూ కామెంట్ చేశారు. ఈ డైలాగులు తమిళంలో చెప్పారు. తర్వాత వెంటనే అర్థమైందా రాజా అంటూ రజనీకాంత్ తెలుగు లో డైలాగు చెప్పటంతో ఇది వైసీపీ ని టార్గెట్ చేసుకుని చెప్పినట్లు సోషల్ మీడియా అంతా ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. వాస్తవానికి తమిళనాడులో జరిగిన కార్యక్రమంలో రజనీకాంత్ తెలుగులో డైలాగు చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వైసీపీ నేతలు తనపై చేసిన విమర్శల దాడిని దృష్టిలో పెట్టుకునే రజనీకాంత్ ఈ మాటలు అన్నట్లు కనిపిస్తోంది. ఈ సమావేశంలో పాల్గొన్న రమ్యకృష్ణ కూడా అర్థమైందా రాజా అంటూ అంటూ తెలుగు డైలాగు చెప్పినప్పుడు నోటికి చేయి అడ్డుపెట్టుకుని మరి నవ్వారు.

కొద్ది రోజుల క్రితం ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కార్యక్రమంలో మాట్లాడిన రజని కాంత్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో వైసీపీ మంత్రులు, నేతలు రజినీపై తీవ్ర విమర్శలు చేయగా , వైసీపీ సోషల్ మీడియా కూడా అప్పటిలో రజనీకాంత్ పై పెద్ద ఎత్తున ఎటాక్ చేసింది. ఇది అప్పటిలో దుమారం రేపింది. వైసీపీ ని ఎక్కడా విమర్శించకపోయినా రజనీకాంత్ పై విమర్శలు చేయాల్సిన అవసరం ఏమి ఉంది అనే చర్చ సాగింది. రజనీ ఫాన్స్ కూడా సీఎం జగన్ టార్గెట్ గా అప్పటిలో సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ఫోటో లతో హంగామా చేశారు. మరి రజని కాంత్ తాజా వ్యాఖ్యలపై కూడా వైసీపీ ఎటాక్ మార్గాన్ని ఎంచుకుంటుందా..లేక చూసీ చూడనట్లు వదిలేస్తుందా అన్నది చూడాలి.

Next Story
Share it