అన్నీ తెలిసి టిక్కెట్ ఎలా ఇచ్చారు మరి?
ఎంపీ రఘురామక్రిష్ణంరాజు తనపై వైసీపీ ఎంపీలు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీలకు చేసిన ఫిర్యాదుపై స్పందించారు. తన గురించి అన్ని తెలిసి పార్టీ టిక్కెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.దొంగలంతా కలసి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రఘురామక్రిష్ణంరాజుకు చెందిన ఇంద్ భారత్ కంపెనీలు బ్యాంకులను మోసం చేశాయని..వెంటనే కంపెనీ డైరక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయసాయిరెడ్డి సారధ్యంలోని ఎంపీలు లేఖలు రాసిన విషయం తెలిసిందే. దొంగలంతా కలసి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
42 వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న వారు తనపై ఫిర్యాదులు చేయటం ఏమిటని ప్రశ్నించారు. తమిళనాడులో తనపై నమోదు అయిన కేసుకు సీఎం జగన్, ఎంపీ బాలశౌరిలే కారణం అని ఆరోపించారు. విజయసాయిరెడ్డి విశాఖను లూటీ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలను పక్కన పెట్టి తనపై అనర్హత వేటు వేయాలంటున్నారన్నారు. ఈ అంశాలన్నింటిపై తాను కూడా రాష్ట్రపతి, ప్రధానులకు వివరంగా లేఖలు రాయబోతున్నట్లు తెలిపారు.