జగన్, విజయసాయిలపై రాష్ట్రపతి, ప్రధానికి ఫిర్యాదులు
ఫిర్యాదులే ఫిర్యాదులు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు. ఈ మధ్యే వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి రెబల్ ఎంపీ రఘురామక్రిష్ణంరాజు కు చెందిన కంపెనీలపై రాష్ట్రపతి, ప్రదాని నరేంద్రమోడీలకు ఫిర్యాదు చేశారు. ఆయన కంపెనీలు బ్యాంకులను మోసం చేశాయన్నారు. 900 కోట్ల రూపాయలపైనే మోసం చేశారని ఈ లేఖల్లో పేర్కొన్నారు. దీనికి కౌంటర్ గా రఘురామక్రిష్ణంరాజు కూడా సోమవారం నాడు లేఖలు రాశారు. ఈ విషయాన్ని ఆయన ఢిల్లీలో మీడియాకు వివరించారు. ఏ1, ఏ2లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశానని అన్నారు. ఏ-1 జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పనులపై రాష్ట్రపతి, ప్రధానికి లేఖ పంపాన్నారు. ఏ-2 పెట్టిన సూట్‌కేసు కంపెనీలతో ఏ-1 కార్యకలాపాలు జరుపుతున్నారని ఆరోపించారు. ట్విటర్‌లో విజయసాయిరెడ్డి అవాస్తవాలు ప్రచారం చేశారన్నారు.
క్విడ్‌ప్రోకో, సూట్‌కేసు కంపెనీల బాగోతాన్ని లేఖలో పేర్కొన్నట్లు చెప్పారు. సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరినట్లు వెల్లడించారు. తాను విదేశాలకు వెళ్లకుండా పాస్ట్‌పోర్టు రద్దు చేయాలని అడుగుతున్నారని, మరి 20కి పైగా కేసులున్న విజయసాయిరెడ్డి పాస్‌పోర్టును ఏం చేయాలని రఘురామ ప్రశ్నించారు. ఏపీ అంశాలపై అందరం కలిసి రాజీనామా చేద్దామని, అందుకు సిద్ధమా? అని ఆయన సవాల్ చేశారు. జగన్ బెయిల్ రద్దు కేసు పలు కారణాలతో మళ్ళీ వాయిదా పడిందన్నారు. గత కొంత కాలంగా రఘురామక్రిష్ణంరాజు వరస పెట్టి ఏపీ సర్కారుపై విమర్శలు చేస్తూ వస్తున్నారు.