Telugu Gateway
Andhra Pradesh

పొలిటికల్ సినిమాలు వస్తున్నాయి

ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల సీజన్ దగ్గర పడటంతో పొలిటికల్ సినిమాల హడావుడి కూడా మొదలైంది. ఈ నెలలోనే రెండు సినిమాలు అయితే పక్కాగా విడుదల కాబోతున్నాయి. అయితే రాజధాని ఫైల్స్ పేరుతో ఒక సినిమా తెరకెక్కుతోంది అనే విషయం నిన్న మొన్నటి వరకు పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ సడన్ గా ఈ సినిమా కు సంబంధించిన ట్రైలర్ విడుదల కావటం...ఆ ట్రైలర్ కు ఒక టాప్ హీరో నటించే కమర్షియల్ సినిమాకు వచ్చిన రేంజ్ లో వ్యూస్ రావటం పెద్ద సంచలనంగా మారింది అనే చెప్పాలి. ఎందుకంటే మంగళవారం ఉదయం నాటికీ ..అంటే ట్రైలర్ విడుదల చేసిన 24 గంటల్లోనే దీనికి ఏకంగా 6 . 3 మిలియన్ వ్యూస్ అంటే 63 లక్షల మంది ఈ ట్రైలర్ ను వీక్షించారు. రాజధాని ఫైల్స్ పేరుతో సినిమా అనగానే ఎవరికైనా ఇది అంతా అమరావతి చుట్టూనే తిరుగుతుంది అనే విషయం తెలిసిపోతుంది. వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అంశంతో పాటు అమరావతి ఇష్యూ కూడా ఒక ప్రధాన ఎజెండా ఉంటుంది అనే విషయం తెలిసిందే. గత ఎన్నికల ముందు అమరావతి కి ఓకే చెప్పిన సీఎం జగన్...అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల నినాదం అందుకున్నారు. ఈ విషయంలో ఆయన మాట మర్చి మడమ తిప్పారు అని సొంత పార్టీ నాయకులే ఇప్పుడు చెపుతున్నారు. కష్టపడమని చెపితే ఎవడైనా మనల్ని ఇష్టపడతాడా?. వాడికి సుఖాన్ని నేర్పి పడుకోబెట్టాలి. 140 కోట్ల జనాభా ఉన్న దేశానికీ ఒక రాజధాని...ఆరు కోట్ల మంది ఉన్న ఒక రాష్ట్రానికి నాలుగు రాజధానిలా..ఇది రాజ్యాంగ బద్దమా...వ్యక్తిగత ద్వేషమా వంటి డైలాగులతో రాజధాని ఫైల్స్ ట్రైలర్ ఎవరిని టార్గెట్ చేసి తీశారో చెప్పకనే చెప్పారు.

ఈ ట్రైలర్ లోనే అధికార పార్టీ లో నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే నేతలు గుర్తు వచ్చే సీన్స్ కూడా పెట్టారు. ఈ సినిమా ఫిబ్రవరి 15 న విడుదల కానుంది. అయితే ఈ చిత్ర నిర్మాత రవి శంకర్ కంఠంనేని సెన్సార్ సమస్యలు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. మరో వైపు అధికార వైసీపీ కి వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం కలిపించే ఉద్దేశంతో ఫిబ్రవరి 8 న యాత్ర 2 సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా అంతా కూడా ప్రధానంగా జగన్ పాదయాత్ర చుట్టూనే తిరుగుతుంది. గత ఎన్నికల ముందు విడుదల అయిన యాత్ర సినిమా వైసీపీ కి కొంత కలిసి వచ్చింది అనటంలో సందేహం లేదు. అయితే ఇప్పుడు జగనే సీఎంగా ఉన్నారు...ఆయన పాలన..వ్యవహార శైలి ఎలా ఉందో ప్రజలు చూశారు. దీంతో ఇప్పుడు సినిమా ప్రభావం ఎంత మేర ఉంటుంది అనే అంశంపై వైసీపీ నేతల్లో కూడా అనుమానాలు ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ లకు...అది కూడా వాస్తవాలను ఆకట్టుకునేలా చెపితే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. అధికారంలో ఉన్న వాళ్లకు మాత్రం అంతగా ఇలాంటివి లాభం చేకూర్చవు అనే చెప్పొచ్చు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా ఇప్పుడు కోర్ట్ కేసు ల్లో చిక్కుకుని ఉంది. దీనికి గ్రీన్ సిగ్నల్ వస్తుందా లేదా అన్నది తేలటానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే యాత్ర 2 , రాజధాని ఫైల్స్ మాత్రం విడుదల కు రెడీ అయ్యాయి. ఇవి ఎవరికి..ఎంత మేర లాభం చేకూర్చుతాయో వేచిచూడాలి.

Next Story
Share it