పదే పదే అదే పనా?!

రాజధాని అమరావతి స్వయం సమృద్ధి ప్రాజెక్ట్ (సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్). ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పాటు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పదే పదే చెప్పే మాట. రాజధాని కారణంగా ప్రజలపై..ప్రభుత్వం పై ఎలాంటి భారం పడదు...రైతుల నుంచి సేకరించిన భూమిని విక్రయించి ఈ ప్రాజెక్ట్ అమలు చేసేందుకు అవసరం అయిన నిధులను సమీకరిస్తాం..అప్పులు చెల్లిస్తాం అని చెపుతున్నారు. మరో వైపు కేంద్రం ప్రపంచ బ్యాంకు తో పాటు ఇతర ఆర్థిక సంస్థల నుంచి ఇప్పిస్తున్న 15000 కోట్ల రూపాయల రుణం కూడా గ్రాంట్ గా మారుస్తున్నారు అని చెపుతున్నారు. రాష్ట్ర విభజన జరిగిన మొదటిలో ఒక్క సారి ఎవరైనా రాజధాని కోసం విరాళాలు అడిగారు అంటే దీన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. విరాళాలు అంటే అది కూడా ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే ఇచ్చేది కాబట్టి ఇందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే చెప్పొచ్చు. కానీ ఒక్క రాజధాని కోసం పదే పదే విరాళాలు అడిగితే మాత్రం చూసే వాళ్లకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఇదే అభిప్రాయం కొంత మంది అధికార టీడీపీ నేతలు కూడా వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకు అంటే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో రాజధాని ప్రాజెక్ట్ అమలు చేస్తున్న ఏపీసిఆర్ డీఏ తన వెబ్ సైట్ లో డొనేట్ మన అమరావతి అని కొత్తగా విరాళాలు ఇవ్వాలని కోరుతోంది. ప్రభుత్వం అడగక ముందే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత మంది ఆసక్తి ఉన్న వాళ్ళు నేరుగా విరాళాలు అందిస్తున్నారు కూడా. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం సర్కారు రాజధాని అమరావతి కోసం విరాళాలు సేకరించింది. హైదరాబాద్ లోనే సచివాలయం ఉన్న సమయంలో ఇక్కడ విరాళాల కోసం అప్పటిలో సీఎం కార్యాలయం ఉన్న ఎల్ బ్లాక్ దగ్గర పెద్ద పెద్ద హుండీలు కూడా పెట్టారు. అప్పటిలో చాలా మంది రాజధాని కోసం విరాళాలు కూడా ఇచ్చారు. కారణాలు ఏమైనా చంద్రబాబు ఫస్ట్ టర్మ్ లో అమరావతి ప్రాజెక్ట్ అనుకున్న స్థాయిలో టేక్ ఆఫ్ కాలేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ..అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టిన విషయం తెలిసిందే.
కానీ మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి కోసం విరాళాలు కోరుతూ వెబ్ సైట్ లో క్యూ ఆర్ కోడ్ పెట్టడంపై కొంత మంది అధికారులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రాజధానికి ఎన్ని సార్లు విరాళాలు అడుగుతారు అని ఒక అధికారి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తొలి సారి అమరావతి ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు మై బ్రిక్ మై అమరావతి పేరుతో పది రూపాయలకు ఇటుకలు కొనుగోలు చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇది ప్రచారం చేసుకోవటానికి పనికి వచ్చింది తప్ప...అప్పటిలో దీనికి పెద్ద స్పందన కూడా వచ్చిన దాఖలాలు లేవు అని చెపుతున్నారు. ఒక వైపు అమరావతి సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటూ ఇప్పుడు మళ్ళీ విరాళాలు అడిగి పరువు తీసుకోవటం ఎందుకో అర్ధం కావటం లేదు అని ఒక మంత్రి కూడా వ్యాఖ్యానించారు. అయినా రాజధాని అమరావతి కోసం పదే పదే విరాళాలు అడగటం ఏ మాత్రం సరికాదు అని టీడీపీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. అమరావతి కి సంబంధించిన కీలక పనులు అన్ని కూడా అప్పగించి ఇప్పుడు విరాళాలు అడగటం ఏంటో అర్ధం కావటం లేదు అని మరో అధికారి వ్యాఖ్యానించారు.



