Telugu Gateway
Andhra Pradesh

ఇలా అయితే కష్టమే!

ఇలా అయితే కష్టమే!
X

ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ లతో కూడిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి కొన్ని రోజుల్లోనే ఏడాది పూర్తి చేసుకోనుంది. ఈ ఏడాది కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వ ప్రభుత్వ పని తీరు ఎలా ఉంది?. ప్రజల అంచనాలు అందుకుందా..ఎన్నికల ముందు ఓట్ల కోసం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందా అన్న ప్రశ్నలు ఉదయించటం సహజం. మరి ఈ ఏడాది కాలంలో చంద్రబాబు నాయుడు సాధించిన విజయాలు ఏమైనా ఉన్నాయా అంటే ప్రతి నెలా క్రమం తప్పకుండా ఇచ్చే నాలుగు వేల రూపాయల సామాజిక పెన్షన్ లు తప్ప...నిజంగా మెన్షన్ చేయదగ్గ గొప్ప విజయాలు ఏమీ లేవు అనే చెప్పొచ్చు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఇంకా అమలులోకి రావాల్సిన చాలానే ఉన్నాయి. కాకపోతే గత జగన్ ప్రభుత్వంతో పోలిస్తే ఉద్యోగులకు సకాలంలో అందుతున్నాయి. జగన్ హయాంలో జీతాలు ఎప్పుడు జమ అవుతాయో తెలియక ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో కీలక విషయం ఏమిటి అంటే అసలు గతంలో ఎప్పుడూ ఎన్నికల ఇష్యూ కానీ మద్యం జగన్ హయాంలో పెద్ద ఇష్యూ గా మారిన సంగతి తెలిసిందే.

అంతే కాదు..తాము అధికారంలోకి వస్తే ప్రజలకు నాణ్యమైన మద్యం అందిస్తామని చెప్పిన పరిస్థితి కూడా ఏపీ లోనే చోటు చేసుకుంది. జగన్ హయాంతో పోలిస్తే మద్యం అలవాటు ఉన్న వాళ్లకు మాత్రం వాళ్ళు కోరుకున్న మందు అందుబాటులోకి వచ్చింది. జగన్ హయాంలో ప్రభుత్వం ఏ బ్రాండ్స్ అమ్మితే అవే తాగాలి తప్ప..డబ్బు పెట్టుకునే వాళ్లకు ఛాయిస్ కూడా లేకుండా చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అనే చెప్పొచ్చు. మందు బాబులకు కోరుకున్న బ్రాండ్స్ అయితే దొరుకుతున్నాయి. దీన్ని చంద్రబాబు సర్కారు విజయంగా చెప్పలేకపోయినా గతంలో ఉన్న సమస్య అయితే తీరింది అనే చెప్పొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సారి చంద్రబాబుకు కాలం కలిసి వచ్చింది అనే చెప్పొచ్చు. కేంద్రంలోని మోడీ సర్కారుకు మూడవ సారి పూర్తి స్థాయి మెజారిటీ రాకపోవటంతో ఇటు టీడీపీ తో పాటు అటు జెడీ యూ లతో కలిసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది.

అయినా కూడా చంద్రబాబు రాష్ట్ర విభజన సమయంలో హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా వంటి విషయాల గురించి ప్రస్తావించలేక పోయారు. రాజకీయంగా ఇది పెద్ద మైనస్. మరో వైపు మోడీ సర్కారు కు పూర్తి సరెండర్ అయ్యారు అన్న అభిప్రాయం టీడీపీ నేతల్లో కూడా ఉంది. కాకపోతే ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ప్రపంచ బ్యాంకు తో పాటు ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తెచ్చుకోవటంలో చంద్రబాబు సర్కారు సఫలం అయింది అనే చెప్పొచ్చు. ఇందుకు కేంద్రం కూడా సహకరిస్తోంది. ప్రత్యేక హోదా తో పాటి విభజన హామీలు ఎన్నో అమలు చేయనందున అమరావతి కి అయినా పెద్ద ఎత్తున గ్రాంట్ కోరారా అంటే అది కూడా లేదు. అప్పు ఇప్పిస్తే చాలు ...అదే మహాభాగ్యం అన్నట్లు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యవహరిస్తున్నారు. అమరావతి తొలి దశ పూర్తి చేయకముందే ఇప్పుడు విస్తరణ ప్రాజెక్ట్ కోసం మరో నలభై వేల ఎకరాలు సమీకరించాలని ప్రతిపాదించటం కూడా దుమారం రేపుతోంది. మరో కీలక విషయం జగన్ హయాంతో పోలిస్తే కూటమి పాలనలో ఆంధ్ర ప్రదేశ్ లోని రోడ్లు చాలా వరకు మెరుగు అయ్యాయి. గతంలో ఉన్న దారుణ పరిస్థితి అయితే ఏమి లేదు.

పోలవరం ప్రాజెక్ట్ తిరిగి పట్టాలు ఎక్కింది. కారణాలు ఏమైనా ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్ట్ అలా సాగుతూపోతోంది. అమరావతి లో ఐబీఎం, ఎల్ అండ్ టి, టిసిఎస్ లు సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న క్వాంటం వ్యాలీ కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇది చంద్రబాబు విజయంగా చెప్పాల్సిందే. పరిశ్రమల పరంగా పెద్ద ఎత్తున హంగామా కనిపిస్తున్నా కూడా ఇవి టేకాఫ్ అయి ఫలితాలు రావాలంటే ఇంకా చాలా సమయమే పడుతుంది. మరో కీలక విషయం ఇందులో గ్రౌండ్ అయ్యేవి ఎన్ని...పనులు పూర్తి చేసేది ఎన్ని అన్నది కూడా కీలకం. తమ బ్రాండ్ చూసే ఏపీకి పెట్టుబడులు వరదలా వచ్చి పడుతున్నాయి అని చెప్పుకునే చంద్రబాబు, నారా లోకేష్ లు కొన్ని కంపెనీలకు రాష్ట్ర ప్రజల సంపదను దోచిపెడుతున్నారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. మరో వైపు చంద్రబాబు సర్కారు గతానికి భిన్నంగా పవర్ ప్రాజెక్ట్ లను ఇష్ఠానుసారం అస్మదీయ కంపెనీలకు కట్టబెడుతూ వెళుతోంది.

ఈ సారి కూటమి సర్కారు లో గనుల శాఖ దగ్గర నుంచి మొదలు పెడితే కీలక శాఖల్లో అవినీతి పీక్ కు చేరింది అనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇక అమరావతి టెండర్ల గోల్ మాల్ వ్యవహారం అయితే కొత్త శిఖరాలకు చేరింది అని అధికారులే అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు ఈ సారి పెద్ద ఎత్తున క్యాబినెట్ లోకి ఎక్కువగా కొత్త వాళ్ళను...లైట్ వెయిట్స్ ను తీసుకుని పరిపాలన అంతా జగన్ తరహాలోనే కేంద్రీకృతం చేశారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. కొంత మంది సీనియర్ మంత్రులు మినహా ఎక్కువ మంది రిమోట్ కంట్రోల్ తో పని చేస్తున్నారు అనే చర్చ సాగుతోంది. ఇక పార్టీ విషయానికి వస్తే ఎన్నడూ లేని విధంగా కూటమి రికార్డు విజయాన్ని దక్కించుకున్నా కూడా ప్రధాన భాగస్వామి అయిన తెలుగు దేశం ఎమ్మెల్యే లతో పాటు క్యాడర్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉంది. సొంత పార్టీ క్యాడరే సోషల్ మీడియా లో టీడీపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

అధికారంలో ఉంటే ఒకలా..ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడటం చంద్రబాబుకు అలవాటే అని అంటూ ...పార్టీ ని నమ్ముకుని పోరాటాలు చేస్తే భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు కొద్దీ రోజుల క్రితమే. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన కొత్తలోనే గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వెలుగు వెలిగిన కొన్ని కార్పొరేట్ సంస్థలతో ఆర్థిక లాలూచీలు, జగన్ ప్రభుత్వంలో హవా చెలాయించిన అధికారులకే కీలక పోస్ట్ లు ఇవ్వటం చాలా మంది టీడీపీ నేతలకు..క్యాడర్ కు ఏ మాత్రం రుచించలేదు. వీటిపై బహిరంగంగానే సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు. ఇక వీళ్ళు మారరు అని చెప్పి ఇప్పుడు మాత్రం అన్ని వదిలేసి ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. మరో వైపు చంద్రబాబు క్యాబినెట్ లోని మంత్రుల్లో కొంత మంది మంది తప్ప పెద్దగా ఇంపాక్ట్ చూపించే వాళ్ళు లేరు అనే అభిప్రాయం కూడా టీడీపీ నేతల్లో ఉంది. మరి రాబోయే రోజుల్లో అయినా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిద్దుబాటు చర్యలు చేపడతారా ..లేక ఇదే ట్రెండ్ కొనసాగిస్తారా అన్నది చూడాలి. మరో కీలక అంశం ఏమిటి అంటే జగన్ హయాంలో ఉచిత పథకాలకు అలవాటు పడ్డవాళ్ళు మాత్రం చంద్రబాబు సర్కారు తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మిగిలిన వర్గాల్లో ఇప్పటికిప్పుడు పెద్దగా వ్యతిరేకత లేదు అనే చర్చ సాగుతోంది. ఎన్నికలకు ఇంకా మూడున్నర ఏళ్ళు సమయం ఉన్నందున ఇంకా ఎన్ని మార్పులు వస్తాయో చూడాలి.

Next Story
Share it