Telugu Gateway
Andhra Pradesh

ఎయిర్ పోర్టు ప్రాజెక్ట్ ఇన్వెస్టర్లే చూసుకుంటారు అంట!

ఎయిర్ పోర్టు ప్రాజెక్ట్  ఇన్వెస్టర్లే చూసుకుంటారు అంట!
X

‘ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి లో బెంగుళూర్ కి మించిన ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ రావాలని కోరుకుంటున్నాం. దానికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టదు. ఇన్వెస్టర్లే కడతారు. దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ’ ఇవీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు ఢిల్లీ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు. ఎప్పుడో 17 సంవత్సరాల క్రితం ప్రారంభం అయిన జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇంకా నష్టాల్లోనే సాగుతోంది. హైదరాబాద్ తో పాటు తెలంగాణ మొత్తానికి కూడా ఇదే ఎయిర్ పోర్ట్ అనే విషయం తెలిసిందే. అంతే కాదు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రజలు అంతర్జాతీయ గమ్య స్థానాలకు వెళ్లాలన్నా కూడా హైదరాబాద్ లోని ఎయిర్ పోర్ట్ నే ఉపయోగించుకుంటారు. 2024 -2025 ఆర్థిక సంవత్సరాల్లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి మొత్తం 2 .13 కోట్ల మంది రాకపోకలు సాగించారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల పెరుగుదల దేశంలోని టాప్ విమానాశ్రయాల కంటే హైదరాబాద్ లోనే ఎక్కువ ఉంది.

ఇంత భారీ ఎత్తున ప్రయాణికులు..ఫ్లైట్ మూమెంట్స్ ఉన్నా కూడా ఇంకా జీఎంఆర్ ఎయిర్ పోర్ట్ లాభాల బాటలోకి రాలేదు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా విస్తరణ పనులు చేస్తుకుంటూ వెళుతుంది. అయితే బెంగుళూర్ ను మించిన విమానాశ్రయం అమరావతిలో రావాలని కోరుకుంటున్నాం అని చంద్ర బాబు చెపుతున్నా కూడా గత ఆర్థిక సంవత్సరంలో విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించిన వాళ్ళ సంఖ్య 13 .8 లక్షల మంది మాత్రమే. ఈ ట్రాఫిక్ రాబోయే ఐదేళ్లలో పెరిగేది ఎంత...అసలు ఈ ఎయిర్ పోర్ట్ ఎలా లాభదాయకం అవుతుంది..ఈ లెక్కలు చూసి ఏ ఇన్వెస్టర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కట్టడానికి ముందుకు వస్తారు అన్నది ఇప్పుడు కీలకం కానుంది. కనీసం ఏటా అరవై లక్షల మంది పైన ప్రయాణికులు ఉన్న చోట మాత్రమే ఏ ప్రైవేట్ ఎయిర్ పోర్ట్ అయినా కొంత మేర లాభదాయకంగా మారే అవకాశం ఉంటుంది అని ఈ రంగంలోని నిపుణులు చెపుతున్నారు. మరో వైపు విమానాశ్రయాలు ఇతర ప్రాజెక్ట్ లు లాగా ..కట్టిన వెంటనే లాభాలు ఇవ్వవు అని..కాకపోతే ప్రభుత్వాల నుంచి ఇతర ప్రయోజనాలు పొందిన కంపెనీలు మాత్రం ఇలాంటి భారీ పెట్టుబడులతో కూడిన ప్రాజెక్ట్ ల విషయంలో ముందుకు వస్తాయని చెపుతున్నారు.

అందుకే అమరావతి ఎయిర్ పోర్ట్ ను చంద్రబాబు సర్కారు ఏకంగా ఐదు వేల ఎకరాల్లో నిర్మించాలని ప్రతిపాదిస్తోంది. ఇప్పుడు వియజయవాడ లో ఉన్న ట్రాఫిక్ తో పాటు వచ్చే 25 సంవత్సరాల ట్రాఫిక్ లెక్కలు వేసుకున్నా కూడా ఇది చాలా చాలా ఎక్కువ అని...రియల్ ఎస్టేట్ వేల్యూ చూపించి కంపెనీలను ఈ ప్రాజెక్ట్ ల దిశగా ఒప్పిస్తారు అని ఒక అధికారి వెల్లడించారు. అయితే అమరావతి లాంటి చోట ఎయిర్ పోర్ట్ కు కొంత ఇచ్చి..మిగిలిన ల్యాండ్ ను రియల్ ఎస్టేట్ ..ఇతర వాణిజ్య అవసరాలకు కేటాయిస్తేనే ఏ కంపెనీ అయినా ఇటు వైపు చూసే అవకాశం ఉంది అని..అందుకే చంద్రబాబు ప్రభుత్వం పెట్టుబడి పెట్టదు అని ..కంపెనీనే పెడుతుంది అని చెపుతున్నారు. అంటే రైతుల దగ్గర నుంచి భూమి తీసుకుని అటు ఎయిర్ పోర్ట్ అవసరాలతో పాటు కంపెనీ వాణిజ్య అవసరాలకు కూడా భూమిని కేటాయిస్తారు అన్న మాట.

అయితే ఇక్కడ ప్రభుత్వం అసలు పెట్టుబడి పెట్టదు అనే మాటలో కూడా ఏ మాత్రం వాస్తవం ఉండదు అనే చెప్పాలి. హైదరాబాద్ లో 17 సంవత్సరాల క్రితం కట్టిన జీఎంఆర్ ఎయిర్ పోర్ట్ ఇంకా లాభాల్లోకి రాలేదు. ఇంత భారీ ఎత్తున ట్రాఫిక్ ఉన్నా కూడా ఇది ఇంకా నష్టాల్లోనే ఉంది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ఎయిర్ పోర్ట్ నిర్మాణ వ్యయం కంటే ఎయిర్ పోర్ట్ కోసం కట్టిన పీవీ ఎన్ ఆర్ ఎక్స్ప్రెస్ వే ..ఇతర కనెక్టివిటీ రోడ్లపై చేసిన వ్యయమే ఎక్కువ. ఎక్కడైనా అభివృద్ధికి ఎయిర్ పోర్ట్ అవసరమే. కానీ ఎయిర్ పోర్ట్ కు ప్రభుతం రూపాయి ఖర్చుపెట్టదు..అంతా ప్రైవేట్ కంపెనీ నే చూసుకుంటుంది అని చెప్పటం మాత్రం ప్రజలను మోసం చేయటం తప్ప మరొకటి కాదు అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఒక వైపు ఇప్పటికే అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటూ చెపుతున్న చంద్రబాబు..ఇప్పుడు ఎయిర్ పోర్ట్ కూడా ఇన్వెస్టర్లే కడతారు అని చెప్పటం చూసి ఏంటో ఈ మాయ అంతా అని అధికారులు కూడా అవాక్కు అవుతున్నారు. అలాంటప్పుడు ఈ మోడల్ ఒక్క అమరావతి...అమరావతి ఎయిర్ పోర్ట్ కే పరిమితం చేయటం ఎందుకు..రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్ట్ లు కూడా ఇలాగే చేస్తే సరిపోతుంది కదా అని ఒక అధికారి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇలాంటి ప్రాజెక్ట్ లపై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినా కుడా యూజర్ డెవెలప్ మెంట్ చార్జీలు (యూడీఎఫ్) కింద ప్రైవేట్ ఎయిర్ పోర్ట్ ఆపరేటర్ లు ప్రయాణికులపై సంవత్సరాల తరబడి భారం మోపుతారు అనే విషయం తెలిసిందే. ఈ విషయాలు అన్ని పక్కన పెట్టి చంద్రబాబు మాత్రం ప్రభుత్వం పెట్టుబడి పెట్టదు అంతా వాళ్లే చూసుకుంటారు అని చెప్పటం ప్రజలను మభ్య పెట్టడం తప్ప మరొకటి కాదు అని అధికార వర్గాలు చెపుతున్నాయి.

Next Story
Share it