నిన్న ప్రవీణ్ ప్రకాష్..నేడు గౌతం సవాంగ్
ఈ అకస్మిక బదిలీల మతలబేంటో?!
వికెట్లు టకా టకా ఎందుకు పడుతున్నాయ్. అసలు ఏపీలో ఏమి జరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆకస్మికంగా బదిలీ అయ్యారు. ఆయన బదిలీని చాలా మంది సంవత్సరాలుగా బలంగా కోరుకున్నా అమలు కాలేదు కానీ అకస్మాత్తుగా జరిగిపోయింది. అది జరిగి 24 గంటలు కూడా గడవక ముందే మరో కీలక వికెట్ కూడా పడింది. అది డీజీపీ గౌతం సవాంగ్. ప్రభుత్వం మంగళవారం నాడు ఆయన్ను బదిలీ చేసింది . ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. తదుపరి పోస్టింగ్ కోసం జీఏడీకి రిపోర్టు చేయాలని గౌతం సవాంగ్ ను ఆదేశించారు. కొత్త డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతల్లో కసిరెడ్డి వి ఆర్ ఎన్ రెడ్డిని నియమించారు.
తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ ఈ ఉత్తర్వుల్లో అమల్లో ఉంటాయన్నారు. వాస్తవానికి సీఎం జగన్ చాలా రోజులుగా గౌతం సవాంగ్ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం నుంచి ఎదురైన ఒత్తిళ్ళకు సవాంగ్ కూడా ఇబ్బందులు పడ్డట్లు అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. గతంలో ఏ డీజీపీ ఎదుర్కోని తరహాలో గౌతం సవాంగ్ ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే అటు ప్రవీణ్ ప్రకాష్, ఇటు డీజీపీ గౌతం సవాంగ్ ల బదిలీలు జగన్ సర్కారు మూడేళ్లు కావస్తున్న సందర్భంగా జరుగుతున్న ప్రక్షాళనలో భాగంగా సాగుతున్నాయా?. లేక వీటి వెనక ఏమైనా కారణాలు అన్నది తేలాల్సి ఉంది.