Telugu Gateway
Andhra Pradesh

జగన్ కు పీకె టెన్షన్ !

జగన్ కు పీకె టెన్షన్ !
X

వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ఇప్పుడు పీకె టెన్షన్ పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో 175 కు 175 సీట్లు అంటూ ప్రతి మీటింగ్ లో జగన్ చెపుతున్నా క్షేత్ర స్థాయి పరిస్థితులు అధికార పార్టీ కి అంత అనుకూలంగా లేవు అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో గత ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం పని చేసిన...ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా ఒక ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు సీఎం జగన్ తో పాటు వైసీపీ నాయకులను షాక్ కు గురి చేశాయని చెప్పాలి. ప్రశాంత్ కిషోర్ పేరుతో ఏదో వార్త వస్తే దానికి అంత ప్రాధాన్యత వచ్చేది కాదు. కానీ ఇది అయన ఆన్ రికార్డు చెప్పిన మాట కావటంతో వైసీపీ నాయకులకు టెన్షన్ మొదలు అయిందే అనే చెప్పాలి. ఎన్నికల ముందు వచ్చే ఎన్నికల్లో జగన్ ఏ మాత్రం గెలిచే అవకాశం లేదు అంటూ ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ప్రజలపై ఏమో కానీ..ఖచ్చితంగా వైసీపీ నాయకులు, శ్రేణులపై ప్రభావం చూపించటం ఖాయం అని ఆ పార్టీ నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో జగన్ కు భారీ దెబ్బ పడబోతోంది అని...ప్యాలస్ లో కూర్చుని ప్రజాధనాన్ని డీబీటి ద్వారా ప్రజలకు ఇస్తున్నాను కాబట్టి తానే మళ్ళీ గెలుస్తాను అనుకుంటే అది ఏ మాత్రం సరికాదు అని... దీనితో ఓట్లు రావు అన్నారు. వనరుల వినియోగంలో జగన్ విధానం సరికాదు అని అభిప్రాయపడ్డారు. ప్రజాధనాన్ని వాళ్లకు పంచటం కంటే ..నాయకులు మెరుగైన పనితీరు చూపించాల్సిన అవసరం ఉంది అన్నారు. ముఖ్యంగా చదువుకున్న యువత ఉద్యోగాలు కోరుకుంటారు కానీ...ఉచిత పథకాలు కాదు అని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు వైసీపీ అవకాశాలను దెబ్బ కొట్టటం ఖాయం అనే అంచనాలు ఉన్న వేళ ప్రశాంత్ కిషోర్ చేసిన కామెంట్స్ అటు వైసీపీ ని..ఇటు జగన్ ను ఇరకాటంలోకి నెట్టేవే అని చెప్పొచ్చు.

Next Story
Share it