జగన్ మరో సెల్ఫ్ గోల్ తో వైసీపీ నేతల అవాక్కు!

గత కొన్ని నెలలుగా ఆంధ్ర ప్రదేశ్ లో మెడికల్ కాలేజీల వ్యవహారం దుమారం రేపుతోంది. పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్ షిప్ (పీపీపీ) విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అప్పగించాలని చంద్రబాబు సర్కారు చూస్తుంటే...తన హయాంలో మొదలుపెట్టిన కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారు అని వైసీపీ నేత జగన్ మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. అందులో భాగంగానే కోటి సంతకాల కార్యక్రమం చేపట్టి గురువారం నాడు గవర్నర్ కు వినపతిపత్రం కూడా అందించారు. ఈ విషయంలో అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ అబద్దాలు చెప్పటంలో పోటీలు పడుతున్నారు అనే చెప్పాలి. ఒక వైపు జగన్ తన హయాంలో వీటిని మొదలుపెట్టిన మాట వాస్తవమే అయినా కూడా ఇప్పటికే అసలు మెజారిటీ పనులు పూర్తి అయ్యాయి అన్న రీతిలో కలరింగ్ ఇస్తున్నారు. మరో వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పీపీపీ అంటే ప్రైవేట్ పరం చేయటం కాదు...ఈ కాలేజీ లు అన్ని ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి...కేవలం నిర్వహణ మాత్రమే ప్రైవేట్ సంస్థలు చూస్తాయి అన్నట్లు చెపుతున్నారు. దీనిపై పదే పదే వివరణలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కారణం ఇది ప్రజల్లోకి బలంగా వెళితే ఇబ్బంది అనే.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెపుతున్నట్లు పీపీపీ అంటే ప్రైవేట్ పరం చేయటం కాదు..ప్రభుత్వం చేతిలోనే అంతా ఉంటుంది అనేది ఏ మాత్రం నిజం కాదు. ఇందుకు ఉదాహరణ హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్. ఇది కూడా పీపీపీ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం ఏకంగా ఐదు వేల ఎకరాల భూమి ఇవ్వటం తో పాటు కనెక్టవిటీ కింద పీవి ఎన్ ఆర్ ఎక్స్ప్రెస్ వే తో పాటు ఇతర రహదారుల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టింది అప్పటిలో సర్కారు . అయినా ఈ నిర్వహణ అంతా ప్రైవేట్ సంస్థ జీఎంఆర్ చేతిలో ఉంటుంది తప్ప...ప్రభుత్వం చేతిలో ఏమీ ఉండదు. కాకపోతే ఇక్కడ ప్రయాణికుల నుంచి వసూలు చేసే యూజర్ డెవలప్మెంట్ ఫీజు (యూడీఎఫ్) ని కేంద్రం పరిధిలో ఉండే ఎయిర్ పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ ఆథారిటీ (ఏఈఆర్ఏ) నిర్ణయిస్తుంది. ఇలాంటి ప్రాజెక్ట్ లు అన్ని తక్కువలో తక్కువ తొలుత 30 సంవత్సరాలు..ఆ తర్వాత మరో 30 సంవత్సరాలు ప్రైవేట్ కంపెనీ చేతిలోనే ఉంటాయి. అంటే ఏకంగా 60 సంవత్సరాలు. ఒక్కో ప్రాజెక్ట్ విషయంలో ఇది ఒక్కోలా ఉండే అవకాశం కూడా ఉంది.
పీపీపీకి సంబంధించి ఇలా కళ్ళ ముందు ఎన్నో మోడల్స్ ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం పీపీపీ అంటే ప్రైవేట్ కాదు...అంతా ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం చేతిలో కంట్రోల్ పెట్టుకుంటే ఏ ప్రైవేట్ సంస్థ అయినా ముందుకు వచ్చి వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి కాలేజీలు, హాస్పిటల్స్ నిర్వహణకు ముందుకు వస్తుందా అంటే కచ్చితంగా నో అనే చెప్పొచ్చు. కానీ చంద్రబాబు ఈ అంశంలో వస్తున్న వ్యతిరేకతను తప్పించుకునేందుకు ఇలా ప్రచారం మొదలుపెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఇలా ఉంటే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విషయంలో పలు అంశాల్లో పారిశ్రామిక వర్గాల్లో వ్యతిరేకత ఉంది. దీనికి ప్రధాన కారణంతో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ..ఇప్పుడు ప్రతిపక్షంలో అనుసరిస్తున్న వైఖరే. ఆయన సీఎం అయిన వెంటనే విద్యుత్ ప్రాజెక్ట్ ల ఎంఓయూ ల్లో మార్పులు చేయాలని చేసిన ప్రయత్నం దేశ వ్యాప్తంగా దుమారం రేపింది. కేంద్రం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలో కూడా తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాలేజీలను తీసుకున్న వాళ్ళను రెండు నెలల్లో జైలు కు పంపుతాను అని బెదిరించటం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా బిడ్స్ వేసే కంపెనీలు..వ్యక్తులను అసలు జగన్ ఎలా జైలు కు పంపగలరు అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కాస్తో కూస్తో ఈ విషయం లో వైసీపీ కి కొంత అనుకూల వాతావరణం ఉంటే జగన్ తన వ్యాఖ్యల ద్వారా మొత్తం రివర్స్ చేసుకోవటమే కాకుండా సెల్ఫ్ గోల్ కొట్టుకున్నట్లు అయింది అని వైసీపీ నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని పీక్ కు తీసుకువెళ్లి మొత్తం రివర్స్ చేశారు అని ఆ పార్టీ కి చెందిన మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ పలు అంశాల్లో పార్టీని...పార్టీ నాయకులను కూడా తీవ్ర ఇరకాటంలో పడేశారు అని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. గూగుల్ డేటా సెంటర్ విషయంలో కూడా వైసీపీ నేతలు అంతా ఒక రకంగా మాట్లాడితే జగన్ సడన్ గా తాము దీనికి వ్యతిరేకం కాదు అని ఒక మీడియా సమావేశంలో ప్రకటించటం ఆ పార్టీ నేతలను షాక్ కు గురి చేసింది. ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలో తప్పు చేసిన వాళ్లపై చర్యలు ఉంటాయి అని చెప్పటం వదిలేసి...కాలేజీ లు తీసుకున్న వాళ్ళను జైలు లో పెడతా అనటం ద్వారా మొత్తం రివర్స్ అయింది అనే చర్చ వైసీపీ నేతల్లో సాగుతోంది. ఒక వైపు చంద్రబాబు అమరావతి కోసం దగ్గర దగ్గర లక్ష కోట్ల రూపాయలు ఖర్చుపెట్టడానికి రెడీ అయ్యారు. మరో వైపు దిగ్గజ కంపెనీలకు వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇవ్వటమే కాకుండా వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములు కూడా కట్టబెడుతున్నారు. కానీ ఒక్క మెడికల్ కాలేజీల విషయంలో మాత్రం ఎందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంత మొండిగా వ్యవహరిస్తున్నారు అన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారింది.



