Telugu Gateway
Andhra Pradesh

కలకలం రేపుతున్న షర్మిల వ్యాఖ్యలు

కలకలం రేపుతున్న షర్మిల వ్యాఖ్యలు
X

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. నిన్నమొన్నటి వరకు ఇది కేవలం తెలంగాణ వరకే పరిమితం అయింది అనుకుంటే..ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన కీలక నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు ఇటీవల వెలుగులోకి వచ్చింది. గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి...అప్పటి వైసీపీ ప్రభుత్వానికి మధ్య మంచి సంబంధాలే ఉన్న విషయం తెలిసిందే. అప్పటిలో. ముఖ్యంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో కెసిఆర్ తో పాటు కేటీఆర్ కు మంచి అనుబంధం ఉంది..ఈ విషయాన్ని వాళ్ళు కూడా ఏ మాత్రం దాచుకోకుండా బహిరంగంగానే వ్యక్తపరిచేవాళ్ళు. బిఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయటానికి వాడుకున్నారు అనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఒక్క రాజకీయ ప్రత్యర్థులే కాకుండా మీడియా అధినేతలు, జర్నలిస్టులు, కొంత మంది జడ్జీలు కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో ఉన్నట్లు ఇప్పటికే పలు మార్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అన్నింటి కంటే ఇప్పుడు కీలకం ఏమిటి అంటే ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల బుధవారం నాడు మీడియా ముందు చెప్పిన విషయాలు మరింత సంచలనంగా మారాయి.

ట్యాపింగ్ చేసి తమ అవసరాలు తీర్చుకోవటమే కాకుండా...అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ఈ ట్యాపింగ్ కు సంబంధించిన రికార్డు లు కూడా అందించినట్లు షర్మిల మాటలను బట్టి తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం రాజ్య సభ సభ్యుడు గా ఉన్న వై వి సుబ్బా రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన రికార్డు ను తనకే వినిపించినట్లు ఆమె సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఇప్పుడు వై వి సుబ్బా రెడ్డి ఈ విషయం ఒప్పుకోకపోవచ్చు అని...తాను మాత్రం బైబిల్ పై ప్రమాణం చేసి ఈ విషయం చెప్పమన్నా చెపుతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో పెద్ద సంచలన అంశంగా మారింది. తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబి) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ట్యాపింగ్ కేసు లో విచారణ వేగవంతం అయిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఏకంగా తన ఫోన్ ట్యాపింగ్ రికార్డు లను తనకే వినిపించారు అని వైస్ షర్మిల చెప్పటం కీలక పరిణామంగా చెప్పుకోవాలి.

షర్మిల బుధవారం నాడు మీడియా తో మాట్లాడుతూ చేసిన వ్యాఖలు ఇలా ఉన్నాయి. ‘ తెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది వాస్తవం. నా ఫోన్,నా భర్త ఫోన్,నా దగ్గర వాళ్ళ ఫోన్ లు ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారు. ఆనాడు ట్యాపింగ్ జరిగిన నా ఆడియో ఒకటి నాకే వినిపించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మని చెప్పినా వస్తా. బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్న... ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం. రేవంత్,చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలి. అనాడు జగన్,కేసీఆర్ మధ్య ఉన్న సంబంధం చూసి రక్త సంబంధం కూడా చిన్నబోయింది. - ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తెలిస్తే మీరు ఏం చేశారు అని నన్ను అడగొచ్చు. ఇది అక్రమం,అనైతికం కదా అని నన్ను అడగొచ్చు. స్వయంగా మీ ఇంట్లో మీరు వింటే ఎందుకు మౌనంగా ఉన్నారు అని అడగొచ్చు. ఆనాడు ఉన్న పరిస్థితులు వేరు. అప్పుడు జగన్, కేసీఆర్ చేసినవి అరాచకాలు. వీరి అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ చిన్నది. - నేను జగన్ కి తోడబుట్టిన చెల్లెలు. ఆ విషయం మరిచి నేను ఆర్థికంగా, రాజకీయంగా ఎదగకూడదు అని కుట్ర చేశారు.

నా భవిష్యత్ ను పాతిపెట్టాలని ఎన్నో చేశారు. ఇందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కుట్ర. నాకు సపోర్ట్ చేసిన వాళ్లను బెదిరించారు. నా అనుచరులను భయబ్రాంతులకు గురి చేశారు. నేను ఊపిరి తీసుకోవడమే కష్టం చేశారు. నేను తెలంగాణలో పార్టీ పెట్టడం జగన్ కి ఏ సంబంధం లేదు. కేసీఆర్ కోసం నన్ను తొక్కి పెట్టాలని చూశాడు. నా చుట్టూ పరిస్థితులను కష్టతరం చేశాడు. నా సర్వైవల్ కోసం నేను పోరాటం చేశా. నా ప్రతి పోరాటానికి అడ్డు పడ్డారు. ఫోన్ ట్యాపింగ్ మీద చర్యలు తీసుకోవాలి. ఎక్కడకు పిలిస్తే అక్కడకు వస్తా. నేను కేసు పెట్టాలి అనుకుంటే అప్పుడే పెట్టే దాన్ని. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో దర్యాప్తు ముమ్మరం చేయాలి.’ అన్నారు.

Next Story
Share it