Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో పొలిటిక‌ల్ ఐఏఎస్!?

ఏపీలో పొలిటిక‌ల్ ఐఏఎస్!?
X

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఇప్పుడు కొత్త పొలిటిక‌ల్ ఐఏఎస్ తెర‌పైకి వ‌చ్చారు. ఆయ‌న అధికారిక విధుల‌తోపాటు రాజ‌కీయ విధులు కూడా నిర్వ‌ర్తిస్తున్నారంట‌. ఐఏఎస్ కు రాజ‌కీయ విధులు ఏమి ఉంటాయి అంటారా?. ఉంటాయి..అంతే. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు అధికార వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. పార్టీకి చెందిన విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు తెలిపిన స‌మాచారం ప్ర‌కారం ఈ పొలిటిక‌ల్ ఐఏఎస్ ప్ర‌తి రోజూ సాయంత్రం కొంత మంది ఎమ్మెల్యేల‌ను తన ఛాంబ‌ర్ కు పిలిపించుకుంటున్నారు. ఇందులో కొంత మంది 'వీక్' మంత్రులు కూడా ఉంటున్నారు. అస‌లు ఈ మీటింగ్ ల సారాంశం ఏమిటంటే మీ మీ నియోజ‌క‌వ‌ర్గాల్లో బిగ్ బాస్ కు త‌ప్ప‌..మీ ప‌రిస్థితి బాగాలేదు.. మెరుగుప‌ర్చుకోండి అని సూచిస్తున్నారు. మ‌రికొంత మందికి అయితే మీరు ఓకే..అయినా జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం అంటూ సూచిస్తున్నారు. ఇవి తాజాగా వ‌చ్చిన స‌ర్వేల ఫ‌లితాలు ఆధారంగా చెబుతున్న స‌మాచారం అంటూ ఒకింత క్లాస్ తీసుకుంటున్నార‌ని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. పార్టీలో ప్రాంతీయ స‌మ‌న్వ‌య‌క‌ర్తలు, స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు..జిల్లా ప్రెసిడెంట్లు ఇలా ఎన్నో వ్య‌వ‌స్థ‌లు ఉండ‌గా వారంద‌రినీ ప‌క్క‌న పెట్టేసి ఈ రాజ‌కీయ బాధ్య‌త‌లను ఐఏఎస్ కు అప్పగించ‌టం ఏమిటో..ఆయ‌న త‌మ‌కు క్లాస్ తీసుకోవ‌టం ఏమిటో అంటూ క్లాస్ పూర్తి అయిపోయిన కొంత మంది నాయ‌కులు స‌హచ‌ర నేత‌ల వ‌ద్ద నిట్టూరుస్తున్నారు.

ఇదే ఇప్పుడు అధికార వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది.గ‌త ప్ర‌భుత్వంలోనూ ఓ సీనియ‌ర్ అధికారి ఇలాంటి విమ‌ర్శ‌ల‌నే ఎదుర్కొన్నారు. మంత్రుల మ‌ధ్య వాటాల పంప‌కంలోనూ ఆయ‌నే కీల‌క పాత్ర పోషించార‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆ అధికారి ప్ర‌స్తుత బిగ్ బాస్ కు అత్యంత స‌న్నిహితుడు కావ‌టం వ‌ల్లే ఆయ‌న‌కు ఈ బాధ్య‌త‌లు అప్ప‌గించార‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. ఇది ఒక్క‌టే కాదు.అత్యంత కీల‌క‌మైన ఆర్ధిక విష‌యాలు కూడా మూడేళ్లుగా ఆయ‌న చేతుల మీదుగానే సాగుతున్నాయ‌ని వైసీపీ నేత‌లు తెలిపారు. హైద‌రాబాద్ లోని అమీర్ పేట‌కు అత్యంత చేరువ‌గా ఉండే ప్రాంతంలో వీకెండ్స్ స‌మావేశాలు పెట్టుకుని..బిల్లుల చెల్లింపుతోపాటు..ప‌లు సెటిల్ మెంట్ల‌కు ఆయ‌నే రింగ్ మాస్ట‌ర్ అని ఓ సీనియ‌ర్ నేత తెలిపారు. గ‌తంలో ఎంత పెద్ద కాంట్రాక్ట‌ర్ కు అయినా ప‌నులు ద‌క్కించుకున్నందుకు.. బిల్లులు క్లియ‌ర్ చేయించుకునేందుకు అంద‌రికీ క‌లిపి గ‌రిష్టంగా మూడు నుంచి నాలుగు శాతం వ‌ర‌కూ ఖ‌ర్చు పెట్టాల్సి వచ్చేద‌ని..ఇప్పుడు అది ఏకంగా ప‌ది శాతానికి చేరింద‌ని ఆ నేత తెలిపారు. ఎలాగైనా అంత మొత్తం చెల్లించి అస‌లు ఏపీ నుంచి దూరంగా ఎటువైపు అయినా వెళ్లాం అని చూస్తున్న వారికి ఇప్పుడు ఆ ప‌రిస్థితి కూడా లేకుండా పోయింద‌ని తెలిపారు. అధికారంలోకి వ‌చ్చిన తొలి రెండేళ్లు ఈ వ్య‌వ‌హారం బాగా సాగింద‌ని..ఇప్పుడు మ‌రీ ఎంపిక చేసిన కేసుల విష‌యంలో మాత్రమే చెల్లింపులు సాగుతున్నాయ‌ని ఓ నేత వెల్ల‌డించారు.

Next Story
Share it