అందులోనూ జగన్ ఫెయిల్
ఏమీ చేయకుండానే అంతా చేసేసినట్లు భ్రమింప చేయటంలో వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా తక్కువేమి కాదు. రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాల ఆమోదం విషయంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలం అయింది. అయినా సరే జగన్ సొంత పత్రిక సాక్షిలో మాత్రం 2020 సెప్టెంబర్ లోనే ‘కేంద్రాన్ని ఒప్పించి..మెప్పించి’ పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తేవటంలో సీఎం జగన్ కీలక పాత్ర పోషించినట్లు రాసుకున్నారు. ఈ బిల్డప్ ఇచ్చి..పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని మూడున్నర సంవత్సరాలు కూడా దాటిపోయింది. కానీ కేంద్రం నుంచి ఇప్పటి వరకు జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం దక్కలేదు. మరి జగన్ కేంద్రాన్ని ఒప్పించి..మెప్పిస్తే అనుమతులు ఇప్పటి వరకు ఎందుకు రాలేదు. విభజన చట్టంలో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అయినా..జగన్ సర్కారు ఎందుకు గత ఐదేళ్లుగా మోడీ సర్కారుతో ఎంతో సఖ్యతతో ఉండి కూడా ఈ పని చేయించుకోలేక పోయింది.
బీజేపీ కి రాజ్య సభలో అవసరం అయిన ప్రతి సారి మద్దతు ఇచ్చిన వైసీపీ రాష్ట్రానికి ఎంతో కీలక ప్రాజెక్ట్ విషయంలో చట్టబద్ధంగా రావాల్సిన అనుమతులు కూడా ఎందుకు తెచ్చుకోలేదు. బీజేపీ కి సరిపడినంత బలం ఉంది కాబట్టే ప్రత్యేక హోదా విషయంలో ఒత్తిడి చేయలేకపోయామని థియరీ లు చెప్పే వైసీపీ నేతలు..మరి రాజ్య సభ లో బీజేపీ కి అవసరం ఉన్న సమయంలో ఒక్కసారి అయినా..విభజన చట్టంలో ఉన్న హామీ అయినా పోలవరం అంచనా వ్యయ సవరింపులకు ఆమోదం తెలిపితేనే తాము మద్దతు ఇస్తామని ఎందుకు ఒత్తిడి చేయలేకపోయింది. దీనికి సీఎం జగన్ కు..వైసీపీ కి అడ్డం వచ్చిన అంశాలు ఏంటి?. బీజేపీ కి వైసీపీ తో ఉన్న అవసరాలను కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందుకు ఉపయోగించలేదు.
సీఎం జగన్ దగ్గర నుంచి వైసీపీ మంత్రులు అందరూ కూడా మన అవసరం ఉంటేనే వాళ్లపై ఒత్తిడి పెట్టి పనులు చేయించుకోగలం అని చెపుతూ వచ్చారు పలు సందర్భాల్లో. కానీ బీజేపీ కి రాజ్య సభలో ఇలాంటి అవసరాలు ఎన్నో వచ్చాయి. కానీ ఏ ఒక్క అవకాశాన్ని కూడా ఆ పార్టీ రాష్ట్రం కోసం వాడిన దాఖలాలు లేవు అనే చెప్పాలి. వాస్తవానికి ఎలాంటి ఒత్తిడి అవసరం లేకుండానే అమలు చేయించుకోవాల్సిన పని ఇది. అయినా సరే జగన్ అటు ఒత్తిడి మోడల్ ను వాడలేదు...మరో రకంగానూ ప్రయత్నం చేయలేదు. దీంతో పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలు అయిన 47,725 కోట్ల రూపాయలకు కేంద్రం ఇప్పటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఏమీ కాక ముందే జగన్ కేంద్రాన్ని ఒప్పించటం వల్ల రాష్ట్రం పై పడాల్సిన 38 వేల కోట్ల రూపాయల భారం తప్పిందని ప్రచారం చేసుకున్నారు. కానీ తీరా చూస్తే ఇంతవరకు అతీగతీ లేదు. మళ్ళీ ఎన్నికలు వచ్చాయి.