Telugu Gateway
Andhra Pradesh

జగన్ బినామీలతో కాకినాడ లో బల్క్ డ్రగ్ పరిశ్రమలు

జగన్ బినామీలతో కాకినాడ లో బల్క్ డ్రగ్ పరిశ్రమలు
X

అప్పుడు వ్యతిరేకించి..ఇప్పుడు అనుమతా?

కాకికాడ ప్రత్యేక ఆర్ధిక మండలి ప్రాంతంలో ఫార్మా యూనిట్ల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు తెలుగుదేశం సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. 'కోనసీమ ప్రాంత ప్రజల ప్రయోజనాల దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలో రసాయన పరిశ్రమ(దివీస్ కెమికల్ ఇండస్ట్రీతో సహా) ఏర్పాటును నేను వ్యతిరేకిస్తున్నాను. గతంలో దీనిని వ్యతిరేకించినట్లు వైసిపి నటించింది. దివీస్ కెమికల్ ఇండస్ట్రీ ఏర్పాటుకు వైసిపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ద్వారా ఇప్పుడా పార్టీ అసలు రంగు బైటపడింది. ఈ రసాయన పరిశ్రమ ఏర్పాటు వల్ల సముద్రజలాలు కలుషితమై మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారు, భూములంతా ఉప్పు తేలడంతో రైతులకు ఎనలేని నష్టం వాటిల్లుతుంది. 300పైగా హేచరీస్ కూడా కాలుష్యంలో చిక్కుకుని చిరు వ్యాపారులంతా పూర్తిగా దెబ్బతింటారు. దీనితో వాళ్ల నిజ ఆదాయాలు క్షీణించడమే కాకుండా ప్రభుత్వ రాబడికూడా పడిపోతుంది. సముద్రజలాలన్నీ కలుషితమై, అసలు చేపల వేట కార్యక్రమాలే లేకపోతే ఫిషింగ్ హార్బర్ ప్రతిపాదన అంతా దారుణ మోసమే.

ఇక్కడ బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటును కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాకినాడ సెజ్ లో 51% షేర్లను రూ 2,511కోట్లకు ఇప్పటికే కొనుగోలు చేసిన జగన్ బినామీలు బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటు ద్వారా కోన ప్రాంతంలో గ్రామాలను కబ్జా చేసి, తీరప్రాంతాన్ని ఆక్రమించి తమ ఇండస్ట్రియల్ ఎస్టేట్ స్థాపనకు చేస్తున్న ప్రయత్నాలను గర్హిస్తున్నాం. ఇటువంటి ప్రజా వ్యతిరేక చర్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రసాయన పరిశ్రమ ఏర్పాటు ప్రయత్నాలను తక్షణమే జగన్ రెడ్డి ప్రభుత్వం విరమించుకోవాలి. లేనిపక్షంలో ఉత్పన్నం అయ్యే దుష్పరిణామాలకు జగన్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వుంటుంది.' అని పేర్కొన్నారు.

Next Story
Share it