హీరోలు నాని..సిద్ధార్థలకు మంత్రి నాని కౌంటర్
ఏపీలో సినిమా టిక్కెట్ల వ్యవహారంపై సర్కారు ఫోకస్ పెట్టినట్లు కన్పిస్తోంది. ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తటం..ప్రభుత్వ ప్రతి నిర్ణయంతో సినిమా టిక్కెట్ల అంశాన్ని ముడిపెట్టి సర్కారును ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేశారు చాలా మంది. ఎవరు ఎన్ని చెప్పినా ఇది సర్కారుకు కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. చిలికిచిలికి గాలివానగా ఈ సినిమా టిక్కెట్ల వ్యవహారం మారింది. అత్యంత కీలకమై అంశాలు వదిలేసి ప్రభుత్వం ఇలాంటి విషయాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం వెనక రాజకీయ, ఇతర కారణాలు ఉన్నాయనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే ప్రభుత్వం ఈ వివాదానికి ముగింపు పలికేందుకు ఉన్నతాధికారులు, పరిశ్రమకు చెందిన వ్యక్తులతో కమిటీ వేసింది. అంతే కాదు..మంగళవారం నాడు ఏపీ రవాణా, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని నాని సమావేశం అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆయన సినిమా హీరోలపై నాని కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో జరిగిన ఈ కీలక సమావేశంలో సినిమా టికెట్ ధరలు, థియేటర్ల ఇబ్బందులపై ప్రధానంగా చర్చించారు. మొత్తం 19 మంది డిస్ట్రిబ్యూటర్లు, ఎఫ్ డీసీ చైర్మన్ విజయకుమార్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. సుమారు రెండు గంటలపాటు కీలక విషయాలపైనే చర్చ జరిగింది.
ఇందులో భాగంగా టికెట్ల రేట్లపై పలు ప్రతిపాదనలను డిస్ట్రిబ్యూటర్లు మంత్రి ముందుంచారు. అంతేకాదు.. సినిమా థియేటర్ల తనిఖీ విషయాన్ని కూడా మంత్రి దృష్టికి తెచ్చారు. ఇందుకు మంత్రి బదులిస్తూ.. హాళ్లలో వసతులు మెరుగుపర్చాలని ముందే చెప్పామని.. సమయం ఇచ్చినా మార్పు లేకపోవడంతోనే తనిఖీలు చేశామన్నారు. ఎగ్జిబిటర్ల ప్రతిపాదనలు కచ్చితంగా పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ' హీరో నాని గతంలో కిరాణా కొట్టు లెక్కలు చూసారేమో మాకు ఎలా తెలుస్తుంది. హీరో సిద్దార్డ్ వ్యాఖ్యలు తమిళనాడు సీఎం స్టాలిన్‌ను ఉద్దేశించి ఉండొచ్చు. అసలు సినిమా హీరోలకు టికెట్‌ల గురించి ఎందుకు..?' అని వ్యాఖ్యానించారు. సామాన్యులకు వినోదాన్ని ఇవ్వడంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో కమిటీ కచ్చితంగా నిర్ణయం తీసుకుంటుందని మంత్రి సమావేశంలో తెలిపారు.'గతంలో బామ్మర్ది తీసిన సినిమాకి రాయితీ ఇచ్చారని, అదే చిరంజీవి తీసిన సినిమాకి రాయితీ ఇవ్వలేదని చంద్రబాబును ఉద్దేశించి పేర్ని నాని మాట్లాడారు. సీఎం జగన్ అందరినీ ఒకేలా చూస్తారని పేర్ని నాని స్పష్టం చేశారు.