పెద్దిరెడ్డి మాట్లాడొచ్చు..ఎస్ఈసీ..నిమ్మగడ్డపై తప్ప
ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరి కొంత ఊరట లభించింది. సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఆయన డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేశారు. దీనిపై బుధవారం నాడు తీర్పు వెలువడింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడొచ్చని..అయితే ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎస్ఈసీపైన, నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైనా ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించింది. కొద్ది రోజుల క్రితం నిమ్మగడ్డ రమేష్ కుమార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేయటంతోపాటు మీడియాతో మాట్లాడనివ్దొదని డీజీపికి ఆదేశాలు జారీ చేశారు.
దీనిపై పెద్దిరెడ్డి కోర్టును ఆశ్రయించగా..కోర్టు హౌస్ అరెస్ట్ ఆదేశాలను పక్కన పెట్టి..మీడియాతో మాట్లాడొద్దనే ఆదేశాలు మాత్రం పాటించాల్సిందేనని తీర్పు వెలువరించింది. దీనిపై డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేస్తే మీడియాతో మాట్లాడే అంశంపై పరిమితులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ఏకగ్రీవ ఎన్నికల అంశంపై తలెత్తిన వివాదంలో ఎస్ఈసీ ఆదేశాలను అమలు చేసే అధికారులను తాము అధికారంలో ఉన్నంత కాలం బ్లాక్ లిస్ట్ లో పెడతామంటూ మంత్రి హెచ్చరించిన విషయం తెలిసిందే.