అధికార పార్టీ ఆత్మరక్షణకు అస్త్రంగా కేశవ్ పేరు
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు దుమారం రేపుతున్న సబ్జెక్టు ల్యాండ్ టైటిలింగ్ చట్టం. దీనిపై వస్తున్న విమర్శలు..ఆరోపణలతో ఎన్నికల ముందు అధికార వైసీపీ ఆత్మ రక్షణలో పడింది. అందుకే ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తో పాటు మంత్రులు..పార్టీ నాయకులు దీన్ని సమర్ధించుకోవటానికి నానా తంటాలు పడుతున్నారు. అన్నిటి కంటే మరో కీలక విషయం ఏమిటి అంటే కేంద్రంలోని మోడీ సర్కారు ప్రతిపాదించిన ఈ చట్టాన్ని దేశంలో ఏ బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అమల్లోకి తేలదు. కానీ ఆగమేఘాల మీద వైసీపీ సర్కారు ఎందుకు దీనిపై ఇంత హడావుడి చేసింది...దీని వెనక ఎజెండా ఏంటి అనే అనుమానాలు తెరమీదకు వచ్చాయి. అసలు చట్టంలో ఉన్న వాటికి బిన్నంగా జగన్ సర్కారు తనకు అనుకూలంగా ఇందులో మార్పులు చేసింది అని టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో పాటు జన సేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ చట్టంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రతి బహిరంగ సభలో ఇప్పుడు వాళ్ళు పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ విషయం ప్రజల్లోకి కూడా బలంగా వెళ్ళింది. అయితే మూడు రోజుల క్రితం వైసీపీ కి ఒక ఆధారం దొరికింది. అదేంటి అంటే టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అసెంబ్లీ వేదికగా ఈ చట్టాన్ని సమర్ధించారు..అనుకూలంగా మాట్లాడారు అని. దీనికి సంబదించిన వీడియోను కూడా విడుదల చేశారు.
అసెంబ్లీ లో మాట్లాడిన పయ్యావుల కేశవ్ ఈ చట్టాన్ని సమర్ధించిన మాట వాస్తవమే. కేశవ్ మాట్లాడిన వీడియో లో ఉన్న ముఖ్యంశాలు ఇలా ఉన్నాయి. ‘ ఈ చట్టం అమలు రెండేళ్లలో అవుతుందా..నాలుగేళ్లు పడుతుందా..ఐదేళ్లు పడుతుందా అన్నది పక్కన పెడితే తప్పకుండా పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్లే బిల్లు అని చెప్పొచ్చు. మొత్తం రాష్ట్రాన్ని సర్వే చేయటం అన్నది ఎంతో పెద్ద కసరత్తు. ఇది సాహసోపేతమైన చర్యనే. సరిగ్గా చేయకపోతే మాత్రం ఇది దుస్సాహసమే అవుతుంది. ఎందుకంటే టైటిలింగ్ లో ఏ మాత్రం ఇబ్బందులు వచ్చినా ..ప్రజలకు భూమిపై ఉండే మమకారం చాలా గొప్పది. దీన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఇంత పెద్ద ఎక్సరసైజ్ చేయాలనుకున్నప్పుడు పర్ఫెక్ట్ ప్లానింగ్, మ్యాన్ పవర్ ,వనరులు కూడా కావాలి. సర్వే తర్వాత డిజిటల్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తాం...రైతులకు హార్డ్ కాపీ ఇవ్వం అంటే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా రైతుకు పాస్ బుక్ లాంటిదో..ఏదో ఒక పేరుతో టైటిల్స్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే వాళ్లకు అది ఒక ఫీలింగ్. ఇది నాది..భద్రంగా ఉంది. రేపు బ్యాంకు లో పెట్టుకుంటాను ..నా దగ్గర ఉంటే తప్ప రికార్డు కాదు అన్న భావన రైతుకు భరోసా కలగదు. ఖచ్చితంగా హార్డ్ కాపీ...పాస్ బుక్ లాంటిది ఇచ్చే ప్రయత్నం చేయాల్సిందే . సరిహద్దుల్లో రాళ్లు కూడా సాంప్రదాయ పద్దతిలో పాతుతూనే...సాంకేతిక పరిజ్ఙానం ఉపయోగించుకోవాలి’ అని సూచించారు.
అయితే టీడీపీ తో పాటు జన సేన ఆరోపిస్తున్న వాటిలో ప్రధాన అంశం టైటిల్ ప్రభుత్వం వద్దే ఉంటుంది అని. ఇదే అది పెద్ద వివాదాస్పద అంశం. దీంతో పాటు ఇంకా ఎన్నో సందేహాలు ఈ కొత్త చట్టంపై వ్యక్తం అవుతున్నాయి. ఒక వైపు వైసీపీని రాజకీయంగా అత్యంత ఇరకాటంలో పెట్టిన అంశం నుంచి బయటపడటానికి అటు సీఎం తో పాటు వైసీపీ నేతలు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేరును వాడుతున్నా ఆయన ఇప్పటి వరకు బయటకు వచ్చి దీనిపై మాట్లాడకపోవడంపై టీడీపీ నాయకులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేశవ్ టీడీపీ కోసం పని చేస్తున్నారో..లేక వైసీపీ కు అండగా ఉంటున్నారో అర్ధం కావటం లేదు అనే వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. ఎందుకంటే కేశవ్ అసెంబ్లీ లో చెప్పిన దానికి ..ఇప్పుడు బయట ఆ పార్టీ వాదనకు పెద్దగా తేడా లేదు అనే చెప్పొచ్చు. అయినా సరే ఒక వైపు వైసీపీ ఇంత పెద్ద ఎత్తున ఈ విషయాన్ని వాడుకుంటుంటే కేశవ్ మౌనాన్ని ఆశ్రయించటం పార్టీలో దుమారం రేపుతోంది. గత ఐదేళ్ల కాలంలో ఆయన పీఏసి చైర్మన్ గా ఉండి కూడా ఎప్పుడూ జగన్ పై విమర్శలు చేసిన దాఖలాలు లేవు అని...గత ప్రభుత్వ వైఫల్యాలను ఆయన బయట పెట్టింది కూడా ఏమి లేదు అనే చెప్పొచ్చు. ఏదో ఒకటి రెండు సార్లు రెండు అంశాలపై హడావుడి చేసి...తర్వాత మాయం అయిపోయిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందు ఇంత దుమారం రేపుతున్న ల్యాండ్ టైటిలింగ్ చట్టం విషయంలో వైసీపీ తనను తాను రక్షించుకునేందుకు కేశవ్ పేరు బయటకు తీసినా ఆయన మౌనాన్ని ఆశ్రయించటం పలు అనుమానాలు తావిస్తోంది. కేశవ్ తీరు చూస్తుంటే ఆయన టీడీపీ లో ఉన్నారో ..వైసీపీ కోసం పని చేస్తున్నారో అర్ధం కావటం లేదు అని ఒక నాయకుడు వ్యాఖ్యానించారు.