పనులు చేస్తున్న మేఘా జాయింట్ వెంచర్ పేరుపైనా మౌనం
ఇది ఇప్పుడు కొంత మంది తెలుగు దేశం నాయకుల్లో సాగుతున్న చర్చ. ఆ పార్టీ లో చాలా మంది నాయకులు వైసీపీ అధినేత , సీఎం జగన్ మోహన్ రెడ్డి పైనే నేరుగా విమర్శలు చేస్తారు. ఇది అందరికి తెలిసిన విషయమే. కాకపోతే ఈ విషయంలో ఒక్కరికి మాత్రం మినహాయింపు ఉంది. ఆయనే ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే, అత్యంత కీలకమైన ప్రజా పద్దుల కమిటీ (పీఏసి) చైర్మన్ పయ్యావుల కేశవ్. తాజాగా అయన జూమ్ లో ఒక మీడియా సమావేశం నిర్వహించారు. అందులో మీడియా ప్రశ్నలకు సమాధానాలతో కలుపుకుని దగ్గరదగ్గర అర గంట మాట్లాడారు. పోనీ అయన చెప్పింది ఆషామాషీ విషయమా అంటే అదేమీ కాదు. కచ్చితంగా అత్యంత కీలకమైన అంశం. అసలు పనులు చేయకుండానే రాయలసీమ ఎత్తిపోతల పనుల్లో కాంట్రాక్టు సంస్థకు 739 కోట్ల రూపాయల మేర చెల్లింపులు చేశారు అని వెల్లడించారు. అది కూడా నేరుగా రుణంగా తీసుకున్న మొత్తం ప్రభుత్వ ఖజానాకు చేరకుండా కంపెనీ ఖాతాలకు మళ్లించారు అని వెల్లడించారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తో పాటు మరో సంస్థ నుంచి రుణాలు తెచ్చి మరీ ఈ చెల్లింపులు చేశారు అని ఆరోపించారు. ఇంత పెద్ద వ్యవహారం సీఎం జగన్ ఆమోదం లేకుండా ముందుకు సాగదు అనే విషయం తెలిసిందే. కానీ తాజా ప్రెస్ మీట్ లో ఎక్కడా కూడా కేశవ్ సీఎం జగన్ పేరు ఎత్తకుండా కేవలం సాగునీటి శాఖ మంత్రి అంబటి రాంబాబు పేరును మాత్రమే ప్రస్తావించారు. ప్రాంతీయ పార్టీలు అది టీడీపీ అయినా, వైసీపీ అయినా పూర్తిగా అధినేతల కనుసన్నల్లోనే సాగుతాయి. ముఖ్యంగా వేల కోట్ల రూపాయల లావాదేవీలు ఉన్నప్పుడు అసలు ఏ మాత్రం వాళ్లకు తెలియకుండా జరిగే ఛాన్స్ లేదు. కానీ పయ్యావుల కేశవ్ మాత్రం అసలు దీనిపై సీఎం జగన్ పేరు తీసుకురాకుండా మాట్లాడటం టీడీపీ నాయకుల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే అంబటి ఓకే అన్నారు అని తాను ఈ అంశంపై సిబిఐ విచారణకు లేఖ రాస్తానని...విచారణకు అడ్డుపడొద్దు అని పయ్యావుల కేశవ్ కోరటం పెద్ద కామెడీగా ఉంది అనే చర్చ అధికార వర్గాల్లో కూడా సాగుతోంది. ఒక ఎమ్మెల్యే, పీఏసి చైర్మన్ లేఖ రాస్తే సిబిఐ విచారణకు తీసుకుంటుందా ...ఆ విషయం పయ్యావుల కేశవ్ కు తెలియదా...ఎందుకు ఈ డ్రామా అంతా అనే విషయం పొలిటికల్ సర్కిల్స్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది. మరో కీలక విషయం ఏమిటి అంటే కేశవ్ ఈ విషయంలో సీఎం జగన్ పేరు మాత్రమే కాదు...ఈ ప్రాజెక్టు పనులు చేస్తున్న జాయింట్ వెంచర్ లో భాగస్వామిగా ఉన్న మేఘా ఇంజనీరింగ్ పేరు ప్రస్తావించకపోవటంపై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే పయ్యావుల కేశవ్ గతంలో కూడా జగన్ సర్కారు ఆర్థిక అవకతవకలు...విద్యుత్ ప్రాజెక్ట్ ల మోసాలు అంటూ కొన్ని రోజులు హడావుడి చేసి వీటిలో ఏ ఒక్క అంశానికి కూడా ఒక హేతుబద్ధ ముగింపు తీసుకురాకుండా వదిలేశారు అనే చర్చ కూడా పార్టీలో ఉంది. ఇప్పుడు మరి అయినా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ మోసాలపై అయినా చిత్తశుద్ధితో పోరాటం చేస్తారా..లేక మధ్యలోనే దీని వదిలేస్తారా అన్నది వేచిచూడాల్సిందే.