ఏపీఎస్ డీసీ అప్పుల లెక్కలు చెప్పండి
ఏపీ ఏఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ బుధవారం నాడు ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ కు మరో లేఖ రాశారు. ఏపీ అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ డీసీ) కి సంబంధించిన అప్పుల లెక్క చెప్పాలని అందులో కోరారు. ఈ సంస్థ బ్యాంకుల నుంచి ఎంత మొత్తం రుణాలు తీసుకుంది..దీనికి ఇచ్చిన బ్యాంక్ గ్యారంటీల వివరాలు ఏంటో తెలపాలన్నారు. పీఏసీ ఛైర్మన్ ఏమి సమాచారం కోరితే అది ఆర్ధిక శాఖ అధికారులు ఇస్తారంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా కేశవ్ తన లేఖలో ప్రస్తావించారు. రుణాల వివరాలతో పాటు ఈ ఒప్పందాలకు సంబంధించి పత్రాలను కూడా ఇవ్వాలని కోరారు.
ఎస్ డీసీ రుణాలకు సంబంధించి సమాచారం రాష్ట్ర శాసనసభకు సమర్పిస్తే ..దానికి సంబంధించిన పత్రాలు కూడా ఇవ్వాలన్నారు. గత కొన్ని రోజులుగా ఏపీ ఆర్ధిక పరిస్థితికి సంబంధించి పయ్యావుల వర్సెస్ ఆర్ధిక శాఖ మధ్య వివాదం సాగుతున్న విషయం తెలిసిందే. 41 వేల కోట్ల రూపాయల ఖర్చుకు సంబంధించి సరైన బిల్లులు లేవంటూ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ రాసిన లేఖతో పీఏసీ ఛైర్మన్ గా ఉన్న పయ్యావుల ఇటీవలే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై బుగ్గన మంగళవారం నాడు వివరణ ఇచ్చారు. అయితే ఈ వివరణ ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదంటూ పయ్యావుల స్పందించిన విషయం తెలిసిందే.