Telugu Gateway
Andhra Pradesh

బుగ్గన క‌థ‌లు..బుర్ర క‌థ‌ల్లా ఉన్నాయి

బుగ్గన క‌థ‌లు..బుర్ర క‌థ‌ల్లా ఉన్నాయి
X

ప్ర‌భుత్వ ఆర్ధిక అవకతవకలకు సంబంధించిన అంశంపై ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర‌నాథ్ రెడ్డి స‌మాధానం ఏ మాత్రం స‌రిగాలేద‌ని టీడీపీ ఎమ్మెల్యే, ఏఏసీ ఛైర్మ‌న్ ప‌య్యావుల కేశ‌వ్ విమ‌ర్శించారు. అత్యంత కీల‌క‌మైన అంశంపై బుగ్గ‌న చాలా తేలిక వ్యాఖ్యలు చేశార‌న్నారు. పీఏసీ ఛైర్మ‌న్ లేఖ రాస్తే ఏడాది పాటు కూడా స‌మాధానం ఇవ్వ‌లేద‌ని..మ‌రి ఇందుకు కార‌ణ‌మైన ఆర్ధిక శాఖ అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటారా అని ప్ర‌శ్నించారు. కాగ్ లేవ‌నెత్తిన అభ్యంత‌రాల‌పై గ‌వ‌ర్న‌ర్ కు విన‌తిప‌త్రం ఇస్తే ఎందుకు అంత కంగారు అని ప్ర‌శ్నించారు. సీఎఫ్ ఎంఎస్ వ‌ల్లే తప్పు ఐతే... గత ప్రభుత్వం లో పీఏసీ చైర్మన్ గా ఉన్న బుగ్గన ఎందుకు అడగలేద‌న్నారు. పీఏసీ ఛైర్మ‌న్ స‌మాచారం అడిగితే అధికారులు ఇస్తారు క‌దా అని బుగ్గ‌న చెప్పార‌ని..ఇప్పుడు ఆయ‌న మాట ప్ర‌కార‌మే స‌మావేశం పెట్ట‌బోతున్నాన‌ని..స‌మాచారం ఇవ్వాల్సిందిగా త‌మ శాఖ అధికారుల‌కు చెప్పాల‌న్నారు. 25 వేల కోట్ల అప్పు దాచడం పై మంత్రి సమాధానం చెపుతారా, సీఎం సమాధానం చెపుతారా అని ప్ర‌శ్నించారు. ప్రభుత్వం అప్పులు చేయడాన్ని తాము తప్పు పట్టడం లేద‌ని... ఆదాయాన్ని పెంచుకోకుండా తప్పులు చేస్తున్నార‌న్నారు. 55 నిముషాల మీడియా సమావేశం లో కూడా బుగ్గన ఎక్క‌డా స‌రైన సమాధానం చెప్పకుండా రాజకీయ విమ‌ర్శ‌ల‌కు ప‌రిమితం అయ్యార‌న్నార‌ని, అన్ని వ్యవస్థలు తప్పే... తానే మేధావి అన్నట్లు మంత్రి బుగ్గన మాట్లాడార‌ని ఎద్దేవా చేశారు. గ‌వ‌ర్న‌ర్ ను క‌లిశాక తాను ఏడు నిమిషాలు మాట్లాడిన అంశానికి.. ఆయన 55 నిమిషాలు మాట్లాడారని పేర్కొన్నారు.

అది కూడా మూడు రోజుల తర్వాత అధికారులు చెప్పినట్టు బుగ్గన చెప్పారని విమర్శించారు. సీఏజీ తప్పు చెప్పిందని, ఢిల్లీలో వాళ్లకు అర్థం కాలేదు అని మాట్లాడుతారా? అని పయ్యావులయ ప్రశ్నించారు. గ‌త ఏడాది జూన్‌ 17న ప్రిన్సిపాల్ సెక్రటరీ ఫైనాన్స్, సీఎస్‌ని లెక్కలు అడిగితే సంవత్సరం తర్వాత జులై 1న తనకు ఒక లైన్ సమాధానం చెప్పారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 25 వేల కోట్లకు బ్యాంక్‌ గ్యారంటీ ఇచ్చింది లెక్కల్లో చూపలేదని తప్పుబట్టారు. 25 వేల కోట్లు అనేది పరిమితికి మించి చేసిన అప్పు అని పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. అసెంబ్లీలో ఒక‌టి..కోర్టుల‌కు ఒక‌టి, బ్యాంకుల‌కు మ‌రో ర‌కంగా చెబుతున్నార‌ని కేశ‌వ్ విమ‌ర్శించారు. ప్ర‌జ‌లు వైసీపీకి ఓట్లేసి గెలిపించార‌ని..అయినా రాజ్యాంగ ప్ర‌కార‌మే ముందుకు సాగాల్సి ఉంటుంద‌ని అన్నారు. తాము అడుగుతున్న‌ది కూడా అదేన‌న్నారు. బుగ్గ‌న క‌థ‌లు..బుర్ర‌క‌థ‌లుగా మారుతున్నాయ‌ని ఎద్దేవా చేశారు.

Next Story
Share it