అమిత్ షా హామీ ఇస్తే అయిపోయినట్లేనా!

రాజకీయ నాయకులు గతంలో చెప్పిన మాటలను కన్వీనెంట్ గా మర్చిపోయి ప్రజలకు పెద్ద పెద్ద సందేశాలు ఇస్తుంటారు. ఎప్పటికప్పుడు తన అవసరాలకు అనుగుణంగా మాటలు మార్చటంలో జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఇతర నాయకులతో పోటీ పడుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా తో పాటు ఆంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతి విషయంలో పవన్ కళ్యాణ్ ఎన్ని సార్లు మాటలు మార్చారో లెక్కే లేదు. కానీ ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ అమిత్ షా హామీ ఇచ్చిన తర్వాత ఇక ఆందోళన ఎందుకు అన్నట్లు మాట్లాడటం చూసి అవాక్కు అవుతున్నారు. డీలిమిటేషన్ విషయంలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఉన్న సీట్లు దేశ వ్యాప్తంగా 50 శాతం పెంచుతున్నట్లు కొద్ది నెలల క్రితం ప్రకటించారు. కానీ ఇదే విషయాన్ని బిల్లు లో మాత్రం పెట్టలేదు.
ఈ విషయాలు అన్నీ పవన్ కళ్యాణ్ కన్వీనెంట్ గా మర్చిపోయి అమిత్ షా చెప్పిన తర్వాత ఇంకేమి అన్న చందంగా మాట్లాడారు. మరో కీలక విషయం ఏమిటి అంటే తాజాగా పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ముఖ్యమంత్రులు కూడా దక్షిణాది..ఉత్తరాది అంటూ మాట్లాడటం సరికాదు పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇదే పవన్ కళ్యాణ్ 2018 లో విజయవాడ ఒక సభలో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ తో పాటు ఇతర ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం ఏంటి అంటూ ఆవేశంగా ప్రశ్నించారు. అంతే కాదు...దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడాల్సిన అవసరం ఉంది అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మాత్రం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగినా కూడా మాట్లాడకూడదు అనే తరహాలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వాములుగా తెలుగు దేశం, జనసేన లు ఇప్పుడు కేంద్రాల్లోని మోడీ సర్కారు కు భజన చేయడంపైనే ఫోకస్ పెడుతున్నాయి తప్ప...వాళ్ళు చేసే తప్పులను మాత్రం పట్టించుకోకూడదు అన్న చందంగా వ్యవహరిస్తున్నాయి.



