Telugu Gateway
Andhra Pradesh

'వారాహి' వాహనానికి లైన్ క్లియర్

వారాహి వాహనానికి లైన్ క్లియర్
X

జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కోసం సిద్ధం చేసుకున్న 'వారాహి' వాహనం వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రధాన మైనది ఈ వాహనానికి వాడిన రంగు. ఎందుకు అంటే అది కేవలం రక్షణ రంగ వాహనాలకు మాత్రమే వాడాల్సిన ఆలివ్ గ్రీన్ రంగు ఈ వాహనానికి ఉండటం తో వివాదం మొదలైంది. అయితే ఈ వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసిన తెలంగాణ రవాణా శాఖ అధికారులు దీనిపై స్పందించారు. పవన్ కళ్యాణ్ వాహనం క్యారవాన్ కోసం దీన్ని సిద్ధం చేశారు అని...నిర్మాణ సంస్థ ఇచ్చిన సర్టిఫికెట్ ప్రకారం దీని రంగు ఎమరాల్డ్ గ్రీన్ అని తెలిపారు. నిబంధనల ప్రకారం చాప్టర్ 121లో ఒక విషయం స్పష్టంగా ఉందని తెలిపారు. డిఫెన్స్ శాఖకు చెందిన వాహనాలకు తప్ప అగ్రికల్చర్ ట్రాక్టర్లతో పాటు ఇతర ఏ వాహనాలకూ ఆలివ్ గ్రీన్ కలర్ పెయింటింగ్‌గా వేయకూడదని ఆ నిబంధనల్లో స్పష్టంగా ఉందని తెలిపారు.ఈ వాహనం కూడా పవన్ కళ్యాణ్ పేరు మీద కాకుండా వేరే వాళ్ళ పేరు మీద ఉందని అని తెలిపాడు. మీడియా లో ఈ విషయం వివాదం అయినా తర్వాతే తాము అన్ని అంశాలు పరిశీలించగా అంతా నిబంధనల ప్రకారమే ఉందని తెలిపారు.

చాసిస్ మార్చకుండా ఎలాంటి మార్పులు అయినా చేసుకోవచ్చని, సహజంగా క్యారవాన్ లు అన్ని గూడ్స్ వెహికిల్స్ చాసిస్ ల మీదే చేస్తారని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆ వాహనానికి ఏ పేరు అయినా పెట్టుకోవచ్చు అని.కానీ అది క్యారవాన్ కింద నమోదు అయింది అని తెలిపారు. పవన్‌ 'వారాహి' వాహనానికి ఆర్టీఏ అధికారులు రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ను కూడా కేటాయించారు. 'వారాహి' రిజిస్ట్రేషన్ నెంబర్ TS 13 EX 8384 అని అధికారులు పేర్కొన్నారు. సోషల్ మీడియా లో పవన్ వాహనం పై విమర్శలు రాగా..ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార వైసీపీ దీనిపై పెద్ద ఎత్తున ఎటాక్ చేస్తూ వచ్చింది. దీనికి జనసేన కూడా కౌంటర్లు ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణ రవాణా శాఖ అన్ని బాగానే ఉన్నాయని రిజిస్ట్రేషన్ చేయటంతో వివాదం సమసిపోయిన్నట్లే భావిస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఇక్కడ జరిగినా అది ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో తిరగాల్సి ఉంటుంది. ఈ వాహనం తయారు చేసిన కంపెనీనే స్వయంగా వాహనం రంగు ఎమరాల్డ్ గ్రీన్ అని చెపితే ఎవరు ఏమి చేయటానికి ఉండదు అన్న విషయం తెలిసిందే.

Next Story
Share it